సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలో ఉద్యోగులు కస్టమర్లను బురిడీ కొట్టించారు. చిట్స్ కు సంబంధించిన డబ్బులను మార్గదర్శిలో పనిచేస్తున్న బాలకృష్ణ అనే ఉద్యోగి కస్టమర్ల వద్ద 2024 అక్టోబర్, నవంబర్ మాసాల్లో వసూలు చేశాడు. ఈ క్రమంలో డబ్బులకు సంబంధించి రిసిప్ట్ లను ఇవ్వాల్సి ఉండగా చేతివాటం ప్రదర్శించాడు. వందల మంది కస్టమర్ల నుండి నెలవారీగా పొందిన డబ్బులను నొక్కివేసి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న కస్టమర్లు ఆందోళన చేపట్టారు. ఈ విషయమై మేనేజర్ శ్రీనివాసులు ను సంప్రదించగా తనకేమీ సంబంధం లేదని దాటవేస్తున్నాడు. ఈ క్రమంలో మేనేజర్ గా ఉన్న శ్రీనివాసులు కిందిస్థాయి ఉద్యోగి బాలకృష్ణ పై చర్యలు తీసుకోకుండా వత్తాసు పలకడం ఏమిటని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లుగా మార్గదర్శి చిట్ఫండ్ పై నమ్మకం పెట్టుకొని చిట్స్ కడుతుండగా ఇలా మోసం జరుగుతుందని తాము అనుకోలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా డబ్బులు ఎగ్గొట్టిన బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకొని కస్టమర్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థపై పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

