సత్యమేవ జయతే – హనుమాకొండ
హనుమకొండ : బీఆర్ఎస్ స్వార్థపరమైన రాజకీయాలు చేస్తుందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. బీఆర్ఎస్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిదని అన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మాజీ మంత్రి కేటీఆర్ సంతోషపడుతున్నారని అన్నారు. ఆప్ ఓడిపోవడానికి బీఆర్ఎస్ పార్టీనే ప్రధాన కారణమని చెప్పారు. ఇవాళ(ఆదివారం) హనుమకొండలో మీడియాతో కడియం శ్రీహరి మాట్లాడారు. లిక్కర్ స్కాంతో ఆప్ ఓడిపోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్‌తో ఆప్ స్నేహం చేయడంతోనే అధికారం కోల్పోయిందని ఆరోపించారు. ఆప్- కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుండేదని అన్నారు. ఆప్ పార్టీ అతిగా ఆలోచించుకొని ఒంటరిగా పోటీ చేసిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.
నాకు వేరే ఆలోచన లేదు..
ఎమ్మెల్యేల అనర్హత పిటిషిన్‌పై కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో ఉందన్నారు. ఈనెల 10వ తేదీన తీర్పు రాబోతుందన్నారు. కోర్టు తీర్పును తప్పకుండా శిరసావహిస్తానని చెప్పుకొచ్చారు. ఉపఎన్నికలు వస్తే తప్పకుండా పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. అందులో వెనక్కి పోయేది లేదు…వేరే ఆలోచన లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తేల్చిచెప్పారు.
బీఆర్ఎస్ స్వార్థపరమైన రాజకీయాలు చేస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. బీఆర్ఎస్ ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే మంచిదని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అని గుర్తుచేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు సుద్ధపూసలాగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. బీఆర్ఎస్‌కు ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ చేస్తే సంసారం.. తాము చేస్తే వ్యవభిచరమా? అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు.