PM Kisan Yojana: రైతులకు గుడ్‌న్యూస్, పీఎం కిసాన్ డబ్బులు త్వరలో విడుదల – ముందు ఈ పని చేయండి
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత డబ్బులు ఈ నెలలోనే విడుదల అవుతాయి. 18వ విడత డబ్బులను ప్రధాని మోదీ 15 అక్టోబర్ 2024న విడుదల చేశారు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత ఇన్‌స్టాల్‌మెంట్‌ను ఈ నెల చివరి నాటికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. జాతీయ మీడియా నివేదికల ప్రకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న బిహార్‌లో పర్యటించి, వ్యవసాయ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత, ప్రధాన మంత్రి కిసాన్ యోజన 19వ విడత డబ్బులను పంపిణీ చేస్తారు.
e-KYC ని తక్షణమే పూర్తి చేయండి
మీరు వ్యవసాయదారు అయితే, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద ప్రయోజనాలను పొందడానికి e-KYC అవసరం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, 15 అక్టోబర్ 2024న, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడతను విడుదల చేశారు.
ప్రధానమంత్రి కిసాన్ యోజన అంటే ఏమిటి?
ప్రధానమంత్రి కిసాన్ యోజన లేదా పీఎం కిసాన్ అనేది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం. ఈ పథకం 100% నిధులను భారత ప్రభుత్వమే సమకూరుస్తుంది, రాష్ట్రాలపై ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం ఉండదు. ఈ పథకం కింద, ఏడాదికి రూ. 6,000 మొత్తాన్ని నేరుగా లబ్ధిదారులైన రైతుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి, రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో మొత్తం రూ. 6,000 వార్షిక చెల్లింపు జరుగుతుంది. ఈ డబ్బు అర్హుడైన రైతు బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ అవుతుంది. అయితే, ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ అయి ఉండాలి.
e-KYC చేయడం ఎందుకు అవసరం?
దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఈ పథకం ప్రయోజనాలు చేరేలా & మధ్యవర్తుల ప్రమేయం ఉండకుండా eKYC చేయడం అవసరం. మోసం జరిగే అవకాశాన్ని ఇది తగ్గిస్తుంది.
e-KYC పద్ధతులు
PM కిసాన్ యోజన లబ్ధిదారులు eKYC పూర్తి చేసేందుకు మూడు పద్ధతులు ఉన్నాయి:
OTP ఆధారిత e-KYC (PM-KISAN పోర్టల్ & మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంది)
బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ కామన్ సర్వీస్ సెంటర్లు (CSC) & స్టేట్ సర్వీస్ సెంటర్లలో (SSC) అందుబాటులో ఉంది.
ముఖ ప్రామాణీకరణ ఆధారిత ఈ-కేవైసీ (పీఎం కిసాన్ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంది), దీనిని దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఉపయోగిస్తున్నారు.
ప్రధానమంత్రి కిసాన్ యోజన కోసం ఎలా నమోదు చేసుకోవాలి?
ఈ పథకం కింద, అర్హులైన లబ్ధిదారులు ఆధార్ కార్డు, పౌరసత్వ ధృవీకరణ పత్రం, భూమి యాజమాన్యాన్ని నిరూపించే పత్రాలు, బ్యాంక్ ఖాతా వివరాలతో e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి. దీనికోసం:
పీఎం-కిసాన్ పోర్టల్‌లోకి వెళ్లి రిజిస్టర్ ఆన్‌లైన్‌పై క్లిక్ చేసి, అన్ని వివరాలు పూర్తి చేయండి.
మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లి కూడా ఈ పని పూర్తి చేయవచ్చు.
మీ రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారులను సంప్రదించండి.
స్థానిక రెవెన్యూ అధికారిని సంప్రదించండి.