సత్యమేవ జయతే -హైదరాబాద్: ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంటానని తన ముగ్గురు కూతుళ్లను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని వెంటనే మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలపడంతో ఆ మహిళ ఆచూకీ కనుక్కొని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఇన్స్పెక్టర్ బాలస్వామి సోమవారం భవానీనగర్ పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తలాబ్ కట్ట లకిడి కిటాల్ ప్రాంతానికి చెందింది ఇబ్రహీం, నాజ్మిన్కు పనేండు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కూతుళ్లు. భార్యాభర్త తరుచూ గొడవ పడేవారు.
ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో భార్యాభర్త గొడవ పడగ, నాజ్మిన్ ముగ్గురు కూతుళ్లను తీసుకొని డిండి చెరువులో ఆత్మహత్య చేసుకుంటానని ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త వెంటనే ఈ విషయాన్ని అత్త రహ్మత్ బేగం చెప్పడంతో రహ్మత్ బేగం తొమ్మిది గంటలకు భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఈ విషయం, దక్షిణ మండలం డీసీపీ, ఏసీపీ, దృష్టికి తీసుకెళ్లగా వారి ఆదేశాలపై ఎస్ఐ శివకుమార్ ఆధ్వర్యంలో ఓ బృందం ఏర్పాటు చేసి నాజ్మిన్ ఫోన్ లొకేషన్ ద్వారా కందుకూరు వద్ద ఉన్నట్టు తెలిసింది.
వెంటనే కడ్తల్ కందుకూరు, అమంగల్, పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్లను అప్రమత్తం చేసి తల్లీ కూతుళ్ల ఫొటోలు వారికీ వాట్సాప్ చేయగ, అమంగల్ వద్ద బస్ తనిఖీలు చేస్తుండగా రాత్రి పది గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసులు పట్టుకోకుంటే తాను ముగ్గురు పిల్లలు డిండి చెరువులో ఆత్మహత్య చేసుకునేవారమని చెప్పింది. నల్గురిని భర్తకు అప్పగించి ఇకనుంచి గొడవలు పడవద్దని పోలీసులు సర్దిచెప్పారు.