సత్యమేవ జయతే – హైదరాబాద్
హైదరాబాద్ : దేశ రక్షణ రంగానికి తెలంగాణ వెన్నుదన్నుగా నిలుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా మారడంతో ఇక్కడ అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు కొలువుదీరాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించిన 14 ప్రాధాన్య రంగాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు చోటు కల్పించడంతోపాటు నాటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అనుసరించిన పారిశ్రామిక అనుకూల విధానాలే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎల్అండ్టీ డిఫెన్స్, వెమ్ టెక్నాలజీస్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, జీఈ, కోలిన్స్ ఏరోస్పేస్, టాటా బోయింగ్ ఎరోస్పేస్, టాటా సికోర్‌స్కై ఏరోస్పేస్, స్కైరూట్ ఏరోస్పేస్, శాఫ్రాన్, ధృవ స్పేస్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్, లాక్‌హీడ్ మార్టి న్, ఆజాద్ ఇంజినీరింగ్ తదితర 20కిపైగా కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దీంతో క్షిపణులు, పలు రకాల ఆయుధాలతోపా టు డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు అవసరమైన అనేక రకాల పరికరాలు, విడిభాగాల తయారీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఎదిగింది.
తెలంగాణలో తయారవుతున్న తేలికపాటి ఆయుధాలు
ప్రభుత్వ రంగంలోని బీడీఎల్ సంస్థ చాలా కాలం నుంచి క్షిపణులతోపాటు పలు రకాల ఆయుధాలను ఉత్పత్తి చేస్తుండగా.. ప్రైవేటు రంగంలోనూ అనేక రకాల తేలికపాటి ఆయుధాలు తయారవుతున్నాయి. వాటిలో మిషన్-ప్రూవెన్ కార్ 816 రైఫిల్, కార్ 817 అసాల్ట్ రైఫిల్, తేలికపాటి సీఎస్ఆర్ 338, 308 బోల్ట్-యాక్షన్ స్నైపర్ రైఫిల్స్, సీఎస్ఆర్ 50 బోల్ట్-యాక్షన్ యాంటీ-మెటీరియల్ స్నైపర్ రైఫిల్, అత్యాధునిక సీఎంపీ 9 సబ్ మెషీన్ గన్, క్యారకల్ ఈఎఫ్, క్యారకల్ ఎఫ్ జెన్-2 కంబాట్ పిస్టల్స్ ముఖ్యమైనవి.
రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల అభివృద్ధి ఇలా..
హైదరాబాద్‌లో జీఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో ఏరోసిటీని ఏర్పాటు చేశారు. ఈ ఏరోస్పేస్ ఇండస్ట్రియల్ పార్లో విమానాలతోపాటు రక్షణ రంగానికి అవసరమైన పలు రకాల ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు తయారవుతున్నాయి.
ఆదిభట్లలో ఏర్పాటు చేసిన ఏరోస్పేస్ ఎస్ఈజెడ్లో టాటా గ్రూప్‌తోపాటు అమెరికన్ సంస్థ సికోర్‌స్కై కలిసి హెలికాప్టర్ క్యాబిన్లు, సీ-130జే ఎంపెనేజ్లు, ఎఫ్-16 వింగ్‌లను తయారు చేస్తున్నాయి.
విమాన ఇంజిన్ల తయారీకి అవసరమైన విడిభాగాలను జీఈ సంస్థ ఉత్పత్తి చేస్తున్నది.
హైదరాబాద్‌లో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం క్రాన్ఫీల్డ్ యూనివర్శిటీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సంబంధించిన ఉన్నత విద్యను బోధించేందుకు ఈ వర్సిటీ దోహదపడుతుంది.
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో దిగ్గజాలుగా ఖ్యాతి పొందిన లాక్‌హీడ్ మార్టిన్, టాటా గ్రూప్, జీఎంఆర్ లాంటి సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయి. దీంతో హైదరాబాద్‌లో ఈ రంగానికి అవసరమైన పటిష్టమైన పర్యావరణ వ్యవస్థ ఏర్పాటైంది.
ఏరోస్పేస్ రంగానికి సంబంధించి 2018, 2020, 2022లో తెలంగాణ జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డులను గెలుచుకోవడం రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి నిదర్శనంగా చెప్పవచ్చు.
డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో దేశ పురోభివృద్ధి కోసం హైదరాబాద్‌లోని డీఆర్డీవో, డీఆర్డీఎల్, ఆర్సీఐ, బీడీఎల్, ఎండీఎన్ లాంటి సంస్థలు అనేక పరిశోధనలు నిర్వహిస్తున్నాయి.
దేశ రక్షణ రంగంలో కీలకపాత్ర పోషించే చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ ఇటీవలే ప్రారంభించింది.