సత్యమేవ జయతే – హైదరాబాద్ హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో పార్కులకు రక్షణ లేకుండా పోయింది. చెరువులు, ప్రభుత్వ స్థలాలు కాపాడుతామంటూ గొప్పలు చెబుతూ హైడ్రాను కేటాయించి హంగామా సృష్టించిన సీఎం రేవంత్‌రెడ్డికి నందనవనం పార్కు కనిపిస్తాలేదా..? అంటూ జవహర్‌నగర్ ఆనంద్‌నగర్ కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని 15వ డివిజన్ ఆనంద్‌నగర్‌కాలనీలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నందనవనం పార్కుకు 17 గుంటలు కేటాయించిన రూ. 35లక్షలతో సుందరీకరణ, జిమ్ పరికరాలతో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నందనవనం పార్కును నామరూపాల్లేకుండా కబ్జా చేద్దామని చూస్తున్న బడానేతల భరతం పట్టి పార్కును కాపాడాలంటున్న ఆనంద్‌నగర్ కాలనీవాసులు. పట్టపగలే 20 మంది బౌన్సర్లు, కిరాయి మనుషులతో నందనవనం పార్కు వద్దకు వచ్చి పార్కు బోర్డును తొలగించి లోపలికి ప్రవేశించి జిమ్ పరికరాలు, ఇతర వస్థువులను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఆనంద్‌నగర్‌కాలనీవాసులు ప్రాణాలకు తెగించి బౌన్సర్లను అడ్డుకునేందుకు వెళ్ళగా… బౌన్సర్లు తిరగబడ్డారు. వెంటనే కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించగా… ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పార్కును మా కాలనీకి లేకుండా చేయాలని చూస్తున్న దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో కబ్జాలకు కొదవలేదని, ప్రభుత్వ స్థలాలు మిగిలేలా లేవని, ప్రజలు సేద తీరేందుకు పార్కులు దక్కేలాలేవని జవహర్‌నగర్ ప్రజలు మండిపడుతున్నారు. నందనవనం పార్కు కబ్జా చేయాలని చూస్తే ఊరుకునేదిలేదని, మరో పోరాటానికి సిద్ధమవుతామని కాలనీవాసులు హెచ్చరించారు. ప్రభుత్వ ప్రాపర్టీ నందనవనం పార్కును ధ్వంసం చేసిన దుండగులపై జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని కమిషనర్ వసంత తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.