Friday, March 14, 2025
ads
Homeజిల్లాలుకుల గణన పేరుతో కాంగ్రెస్‌ బీసీలను అవమానించింది :...

కుల గణన పేరుతో కాంగ్రెస్‌ బీసీలను అవమానించింది : కేటీఆర్‌

సత్యమేవ జయతే – హైదరాబాద్ హైదరాబాద్ : బీసీలను కులగణన పేరుతో వంచించి.. అవమానించిందని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలను అవమానించిందని తాము అనడం లేదని.. ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అన్నారని.. అందుకు ఆయనను సస్పెండ్‌ చేశారన్నారు. మీరు బీసీల సంఖ్య ఎలా తగ్గిస్తారు? కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో సమగ్ర కుటుంబ సర్వేలో ఆనాడు 56శాతం ఉన్న బీసీలు.. ఈనాడు 46శాతం ఎట్ల అవుతారని ప్రశ్నిస్తే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఇవాళ మేం అనడం లేదు కదా? రాష్ట్రంలో ఒక్క బీసీ సంక్షేమ సంఘం మీ లెక్కలు సరైనవని అంటుందా? ఒక్క బీసీ బిడ్డ మీ లెక్కతో ఏకీభవిస్తున్నడా? మీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలైనా ఏకీభవించే పరిస్థితి ఉందా?’ అంటూ ప్రశ్నించారు. ‘ఇవాళ కుల గణన పేరుతో బీసీలను వంచించి.. మోసం చేసి.. బీసీ సంఖ్యను తగ్గించి.. ఏదో ఉద్దరించినట్లు సోషల్‌ జస్టిస్‌ అని గవర్నర్‌ నోటివెంట అబద్ధాలు చెప్పించడం సిగ్గుచేటు. కాంగ్రెస్‌ తల్లిని తీసుకువచ్చి సెక్రటేరియట్‌లో పెట్టి.. రాహుల్‌ తండ్రి సెక్రటేరియట్‌ ముందు పెట్టి అదేదో గొప్ప పని చేసినట్లు.. తెలంగాణకు ఏదో ఉద్దరించినట్లు.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్న ఈ ప్రభుత్వానికి మేం చెప్పేది ఒక్కటే.. కాంగ్రెస్‌ తల్లిని, రాహుల్‌ గాంధీ తండ్రి మంచిగా భద్రంగా ప్యాక్‌ చేసి గాంధీ భవన్‌కు మూడేళ్ల తర్వాత పంపిస్తాం. గవర్నర్‌ ప్రసంగం ఇవాళ పూర్తిస్థాయిలో ప్రజలను వంచించడమే కాకుండా.. మోసం చేయడమే కాకుండా.. గవర్నర్‌ ప్రతిష్టను సైతం తగ్గించింది’ అంటూ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. – రేవంత్‌కు దమ్ముంటే దావోస్‌ పెట్టుబడులపై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టాలి.. కేటీఆర్‌ డిమాండ్‌ రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి, ప్రభుత్వానికి దమ్ముంటే దావోస్‌ పెట్టుబడులపై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆరు గ్యారంటీల్లో ఒక గ్యారంటీ అమలు చేయకుండా.. 420 హామీల్లో ఒక్క హామీ అమలు చేయకుండా ఇవాళ కొత్త ప్రాజెక్టుకు ఇటుక పెట్టకుండా 1.62లక్షలకోట్ల అప్పు చేసినందుకు గవర్నర్‌ ఏమన్నా మందలిస్తరేమోనని రేవంత్‌రెడ్డిని అనుకుంటే.. అక్కడ కూడా గాంధీభవన్‌లో ప్రసంగం చేసేలా కార్యకర్తలా గవర్నర్‌ ప్రసంగం సాగింది. తెలంగాణలో ఈ రోజు ఉన్న పరిస్థితికి చావుడప్పు కొట్టాలి. కానీ, పెళ్లిల్లో డీజే కొట్టినట్లు గవర్నర్‌ డబ్బా కొట్టారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎవరిని ఉద్దరించింది? నేను ఒక్క మాట అడుగుతున్న.. దావోస్‌లో రూ.1.79లక్షలకోట్ల పెట్టుబడులని మరోసారి గవర్నర్‌ అబద్ధాలు చెప్పించారు’ అంటూ ధ్వజమెత్తారు. 40 పైసలైనా వచ్చాయా..?
‘గత సంవత్సరం రూ.40వేలకోట్లల్లో 40 పైసలు వచ్చాయా? దమ్ముంటే రేపు ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాం. 2024 జనవరిలో మీరు చెప్పిన రూ.40వేలకోట్ల పెట్టుబడులు దావోస్‌ నుంచి వచ్చినయా.. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్‌ సమావేశాల్లో శ్వేతపత్రం ప్రవేశపెట్టాలి. మీ అన్నదమ్ములతో కుదుర్చుకున్న కాంట్రాక్టులు కాదు. స్వచ్ఛ్‌ బయో అనే కంపెనీ పెట్టి.. రేవంత్‌రెడ్డి సోదరుడు.. అనుముల జగదీష్‌రెడ్డి రూ.వెయ్యికోట్ల పెట్టుబడి పెడుతున్నట్లుగా బిల్డప్‌ ఇవ్వడం కాదు.. పెట్టుబడులు తేవడమంటే. ఇవాళ తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నయ్‌. ఇది వాస్తవం. కేన్స్‌ అనే సంస్థను తాము కష్టపడి ఆనాడు మైసూర్‌ నుంచి తీసుకువచ్చాం. రూ.3700కోట్ల సెమీకండక్టర్ల పరిశ్రమ గుజరాత్‌కు తరలిపోయింది. కార్నింగ్‌ అనే రూ.వెయ్యికోట్ల పరిశ్రమ మేం ఆనాడు తీసుకువస్తే.. తమిళనాడుకు అది తరలిపోయింది’ అని తెలిపారు.
నిర్మాణరంగం కుదేలు..
‘ప్రీమియర్‌ ఎనర్జీస్‌ అనే కంపెనీ రూ.1700కోట్ల పెట్టుబడి ఏపీకి తరలిపోయింది. వాస్తవాలు ఇలా ఉంటే.. రూ.1.79లక్షల కోట్లు కాదు కదా.. ఈ ప్రభుత్వం ఎంత అసమర్థ ప్రభుత్వం అంటే.. కొత్తగా ఒకరు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. వీళ్ల ఆర్‌ఆర్‌ ట్యాక్సులు. వీళ్ల కమీషన్లు, వీళ్ల దాడికి తట్టుకోలేక నిర్మాణరంగం కుదేలైంది. రియల్‌ ఎస్టేట్‌ మొత్తం అస్తవ్యస్తమైంది. ఇంకో వైపు ప్రభుత్వమే స్వయంగా చెబుతున్నది. తమ ఫిస్కల్‌ టార్గెట్‌ రీచ్‌కావడం లేదని చెబుతున్నది. రేపు బడ్జెట్‌లో కూడా చెబుతారని అనుకుంటున్నాం. పరిస్థితి ఇట్లా ఉంటే.. ప్రతి పదం గవర్నర్‌తో చెప్పించింది అబద్ధం. గవర్నర్‌ నోటి నుంచి వచ్చిన ప్రతిమాట అసత్యం. ప్రతీ వ్యాఖ్యం పచ్చి మోసం. ఇవాళ మోసం చేసింది తెలంగాణ ప్రజలను మాత్రమే కాదు.. గవర్నర్‌ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది. గవర్నర్‌ను అవమానించింది. ఇంకో మాటలో చెప్పాలంటే.. దశదిశ లేని కేవలం డబ్బాలో గులకరాళ్లు వేసి ఊపితే ఎలాంటి శబ్దం వస్తుందో.. అలాంటి పరిస్థితే తప్పా.. మరోమాట లేదు’ అన్నారు కేటీఆర్‌.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments