సత్యమేవ జయతే – హైదరాబాద్ హైదరాబాద్ : మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఉదయం 5 గంటలకు ఒక మహిళా జర్నలిస్టును అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు. ప్రజాపాలనలో ప్రజలపై ప్రతీకారం ఎందుకు అని ప్రశ్నించినందుకేనా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అలా ప్రశ్నించడం ఏమైనా రాజద్రోహమా? ఉగ్రవాదమా అని అడిగారు. రాహుల్ గాంధీ రోజూ వల్లెవేస్తున్న రాజ్యాంగంలోని 19వ అధికరణం చదవలేదా అని మండిపడ్డారు. తెలంగాణలోని కొంతమంది అధికారులు నియంతృత్వ పాలకుల ఆదేశాలను గుడ్డిగా అనుసరిస్తున్నారని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. వారు భవిష్యత్తులో అనివార్యమైన, పశ్చాత్తాపానికి గురికావాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన ఆదేశాలను గుడ్డిగా పాటించే ముందు.. అది నైతికమైనదా? కాదా? చట్టబద్ధత ఉందా? లేదా అనేదానిపై ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు. ఆ ఆదేశాలపై మీకు ఏమైనా సందేహాలు ఉంటే తటస్థ చట్టపరమైన అభిప్రాయాలను తీసుకోవాలన్నారు.
మీరు తీసుకునే ప్రతి అనైతిక, అక్రమ చర్యలు బాధితుల మనసులో చెరిగిపోని గాయాలను మిగుల్చుతుందని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మీరు తీసుకునే అనైతిక, అక్రమ చర్యలకు ప్రజాకోర్టులో తప్పనిసరిగా జవాబు చెప్పాల్సి వస్తుందని తెలిపారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఆ సత్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుందని అన్నారు. అలాంటి సమయంలో ఏ పాలకులు కూడా మిమ్మల్ని రక్షించలేరని హెచ్చరించారు. తర్వాత బాధపడే బదులు ఇప్పటి నుంచి జాగ్రత్తగా, నైతికంగా ఉండాలని సూచించారు. మీ భవిష్యత్తును, మీ పిల్లల భవిష్యత్తును జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.