సత్యమేవ జయతే – హైదరాబాద్ హైదరాబాద్ : బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తెలంగాణభవన్‌లో పార్టీ శాసనసభాపక్షం సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లపై బిల్లులు ప్రవేశపెట్టాలని ఈ నెల 6న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వాటిపై తీసుకున్న చర్యలపై కేసీఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు వివరించి, అందుకు అనువైన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ, తదితర అంశాలపై కూడా మార్గనిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు నేనూ వస్తున్నా : కేసీఆర్ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముగిసింది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం మూడు గంటలకు పైగా కొనసాగింది. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అందరం కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కృషి చేద్దామని కేసీఆర్ సూచించారు. అసెంబ్లీ సమావేశాలకు నేను కూడా వస్తున్నానని పార్టీ ప్రతినిధులతో కేసీఆర్ అన్నారు. రేపట్నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.