సత్యమేవ జయతే – హెల్త్ టిప్స్ మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు అనేక రకాల పోషకాలు అవసరమని అందరికీ తెలిసిందే. పోషకాల విషయానికి వస్తే వాటిల్లో విటమిన్లు, మినరల్స్ చాలా ముఖ్యమైనవి. మినరల్స్ మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వాటిల్లో జింక్ అనేక జీవక్రియలను నిర్వహిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండేందుకు జింక్ అవసరం అవుతుంది. అలాగే గాయాలు త్వరగా మానడానికి, మెదడు పనితీరుకు, చర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉండేందుకు, కంటి చూపు కోసం కూడా జింక్ ఉపయోగపడుతుంది. అయితే మన శరీరంలో జింక్ లోపం ఉంటే పలు లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను బట్టి జింక్ లోపం ఏర్పడిందని తెలుసుకుని జింక్ ఉండే ఆహారాలను తింటుంటే ఈ లోపం నుంచి బయట పడవచ్చు. అలాగే అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు. జింక్ లోపం ఉంటే మన శరీరం మనకు ఎలాంటి సంకేతాలను ఇస్తుందంటే.. రోగ నిరోధక వ్యవస్థ..
మన శరీర రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు జింక్ అవసరం అవుతుంది. అయితే జింక్ లోపిస్తే రోగ నిరోధక వ్యవస్థ పనితీరు సరిగ్గా ఉండదు. దీంతో తరచూ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. లేదా వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు వచ్చినా ఒక పట్టాన తగ్గవు. చాలా కాలం పాటు రోగాలు అలాగే ఉంటాయి. ముఖ్యంగా తరచూ దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. అలాగే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. గాయాలు త్వరగా మానవు. పుండ్లు పడతాయి. ఈ లక్షణాలు కనిపిస్తుంటే జింక్ లోపం ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే జింక్ లోపం వల్ల ఆకలి కూడా ఉండదు. మీకు అసలు ఆకలి సరిగ్గా లేకపోయినా కూడా జింక్ లోపంగానే భావించాలి. జింక్ లోపం వల్ల మన నాలుక రుచి చూసే శక్తిని, ముక్కు వాసన చూసే శక్తిని కోల్పోతాయి. దీంతో ఆహారం రుచిగా ఉండదు. అలాగే ఆకలిగా కూడా అనిపించదు.
చర్మం, శిరోజాలు..
జింక్ లోపం ఉంటే జుట్టు పలుచబడి చిట్లిపోతుంది. జుట్టు కుదుళ్లు, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే జింక్ అవసరం అవుతుంది. జింక్ లోపిస్తే జుట్టు సమస్యలు ఎక్కువవుతాయి. జుట్టు బాగా రాలిపోతుంది. అలాగే తలలో ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. చుండ్రు ఏర్పడుతుంది. రాలుతున్న జుట్టు మళ్లీ రాదు. ఈ లక్షణాలన్ని జింక్ లోపాన్ని సూచిస్తాయి. అలాగే జింక్ లోపం వల్ల చర్మ సమస్యలు సైతం వస్తుంటాయి. ముఖ్యంగా చర్మంపై దురదలు ఏర్పడుతాయి. దద్దుర్లు వస్తుంటాయి. ముఖంపై మొటిమలు కూడా వస్తాయి. ఇతర చర్మ వ్యాధులు కూడా వస్తుంటాయి. ఇవన్నీ జింక్ లోపాన్ని సూచిస్తాయి.
జీర్ణ వ్యవస్థ..
మన జీర్ణ వ్యవస్థ పనితీరుకు జింక్ అవసరమే. అలాగే మెటబాలిజంను క్రమబద్దీకరించేందుకు కూడా జింక్ ఉపయోగపడుతుంది. జింక్ లోపం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా తరచూ విరేచనాల బారిన పడుతుంటారు. కొందరికి మలబద్దకం కూడా ఉంటుంది. తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. మెదడు పనితీరుకు కూడా జింక్ పనిచేస్తుంది. జింక్ లోపిస్తే జ్ఞాపకశక్తి తగ్గుతుంది. దేనిపై కూడా దృష్టి పెట్టలేరు. ఏకాగ్రత తగ్గిపోతుంది. మానసికంగా అనారోగ్యంగా ఉన్నట్లు డల్‌గా ఫీలవుతారు. ఈ లక్షణాలన్నీ జింక్ లోపం వల్ల కనిపించేవే. ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. జింక్ లోపిస్తే డాక్టర్లు ఇచ్చే మందులను వాడాలి. అలాగే జింక్ ఉండే ఆహారాలను తింటుంటే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. (నోట్ : ఇంటర్నెట్‌లో మరియు పుస్తకాల ఆధారంగా సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ‘సత్యమేవ జయతే’ బాధ్యత వహించదు.)