Friday, March 14, 2025
ads
Homeఆంధ్ర ప్రదేశ్అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా ...

అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా …

అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా …
– ఆర్య బ్రాహ్మణ ఫ్యూడల్ వ్యవస్థలో స్త్రీలపై అణచివేత!!
సమాజ పరిణామ క్రమంలో తల్లి గుర్తింపుగా గల మాతృ స్వామికి వ్యవస్థ ప్రపంచ దేశాలలో వలెనే మనదేశంలోనూ వున్నది.అన్నీ తానే అయి ఎంతో బాధ్యతాయుతంగా ఆదిమ మాతృ స్వామిక సమూహాలను నడిపించిన చరిత్ర స్త్రీలకు వున్నది.
ఆహార సేకరణ దశలో వున్న మానవ సమూహాలకు వ్యవసాయాన్ని కనిపెట్టి ఆహార ఉత్పత్తిని, స్థిరనివాస పరిస్థితిని కల్పించింది స్త్రీ లే ననేది ఇతిహాసపు చీకటి కోణంలో దాచేస్తే దాగని చారిత్రక యదార్ధ సత్యం.
మనదేశంలో రామాయణ కథాకాలం నాటికి కూడా వునికిలో వున్న మాతృ స్వామికి వ్యవస్థను అప్పుడే బలపడుతున్న ఆర్య బ్రాహ్మణికల్ ఫ్యూడల్ పితృ స్వామిక పురుషాధిపత్య సమాజం అణచివేతకు గురి చేసింది.
ఈ పితృ స్వామికి అణచివేతకు వ్యతిరేకంగా రామాయణ కథాకాలంలో పోరాడిన తాటకి, శూర్పణఖ, జటాయు,హిడింబిణి యిత్యాడి ఆదిమ మాతృస్వామిక సమాజపు నాయకా మణులు తమ ప్రాణాలను సైతం అర్పించారు. బ్రాహ్మణీయ ఫ్యూడల్ పితృస్వామిక పురుషాది పత్యపు సమాజం వీరికి రాక్షసులనే పేరు పెట్టింది.
ఆ కాలం నుండి స్త్రీలను భౌతికంగానే కాకుండా బౌద్ధికంగా కూడా అణిచివేతకు గురి చేశారు. శాశ్వతంగా స్త్రీ – పురుషులకు లొంగు ఉండే విధంగా శాస్త్రాలను, ధర్మాలను, నీతి సూత్రాలను, పాతివ్రత్యం, పతిభక్తి యిత్యాది పురుషాధిపత్యపు భావజాలాన్ని స్త్రీల మెదళ్ళ నిండా దట్టించారు. తరతరాలుగా ఈ భావజాలంతో స్త్రీ మగ్గిపోతూనే వుంది. దైవాన్ని, మతాన్ని జతచేసి అత్యంత పకడ్బందీగా మార్మికవాదంతో సమాజ ఆమోదాన్ని సంపాదించారు.
తల్లే గుర్తింపుగా గల మాతృసామిక సమాజంలో మానవ సమూహాలకు రక్షణగా నిలిచిన ఎల్లమ్మ, మారెమ్మ , నూకాలమ్మ, పోచమ్మ, ఆటలమ్మ పైడమ్మ, పోలేరమ్మ, చౌడమ్మ, అంకాలమ్మ, పేరంటాలమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, సత్తెమ్మ, తలుపులమ్మ, పెద్దమ్మ, సమ్మక్క, సారక్క యిత్యాడి నాయకా మణులు ప్రజల మన్నలను పొంది దేవతలుగా పేరొంది ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి చనిపోయిన తర్వాత కూడా నేటికీ ప్రజల నుండి పూజలందుకుంటున్నారు.
ఆర్యుల రాక నుండి మనదేశంలో ప్రజలను మాతృ స్వామిక ఆచారాల నుండి పిత్రుస్వామిక ఆచారాలకు మళ్ళించటానికి జరిగిన ప్రయత్నాలు విశేషంగా దౌర్జన్యపూరితమైనవి. కుటిల బ్రాహ్మణ మార్మిక, మాయావాదంతో కూడుకున్నవి. ప్రపంచంలో ఇటువంటి దౌర్జన్యాలు ఇటువంటి మాయా మర్మాలు మరెక్కడా జరగలేదు. అయితే మాతృ స్వామిక ఆచారాలకు పితృ స్వామిక ఆచారాలకు మధ్య పెక్కుచోట్ల చరిత్రలో ఘర్షణలు జరిగాయి. భారతదేశంలో స్త్రీని అమానుషంగా హింసించి, ఆమెను ఘోరంగా అవమానించడం జరిగింది. బలమైన శక్తి సామర్థ్యాలు కలిగిన స్త్రీని ఏమీ చేతకాని అల్పురాలిగా,అబలగా ఈ బ్రాహ్మణ భావజాలం లొంగుబాటుకు గురిచేసింది. పురుషుడికి ఒక న్యాయం స్ర్తీ కి ఒక న్యాయ అవతరించాయి.
పాతివ్రత్యం, పతిభక్తి ఆమె నెత్తిన రుద్దారు. సత్యనారాయణ వ్రతాలు,గౌరీ పూజలు, దీక్షలు,ఉపవాసాలు, ఒక్కపొద్దులు,అర్చనలు అన్నీ భర్త యోగ క్షేమాల కోసమే చేయాలన్నారు.భర్త యోగ క్షేమాలే భార్యకు సుమంగళం అన్నారు.భర్త మరణిస్తే భార్య ఐదోతనం కోల్పోతుంది సమాజంలో గౌరవం,విలువ పోతుందన్నారు.
కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత,శయనేషు రంభ లాగ వుండే స్ర్తీయే ఉత్తమమైన ఇల్లాలన్నారు. సతీ సహగమనం పేరిట బలవంతంగా చచ్చిన మగవానితో కలిపి కాల్చిపారేశారు. బాల్య వివాహాల ద్వారా ముక్కు పచ్చలారని పసిపిల్లలకు వివాహాలు చేసి వారికి ప్రాయం రాకముందే ఆ భర్త చనిపోతే విధవలను చేసి గుండు గీసి మూల కూర్చోబెట్టారు. ముండా అన్నారు. ముఖం చూస్తే పాపం అన్నారు. ఎదురు వస్తే అరిష్టమన్నారు. అశుభానికి సూచిక అన్నారు. స్త్రీకి పునర్వివాహం లేకుండా చేశారు.నిండు జీవితం బుగ్గిపాలు చేశారు.
పురుషులు ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు అన్నారు. పురుషుడు వ్యభిచరిస్తే అది అతని రసికత, మగటిమ అన్నారు.ఎంత ఎక్కువమంది స్ర్తీలతో అక్రమ సంబంధాలు వుంటే అతనిని అంత గొప్పవాడిగా కీర్తించారు.యుగపురుషుడన్నారు.వీటి ఆమోదం కోసం అనగనగా ఒకరాజు ఆ రాజుకు ఏడుగురు భార్యలు లాంటి కట్టుకథలు,శ్రీకృష్ణుని పాత్రను సృష్టించి అతని రాసలీలలు,రాస (రోత) క్రీడలను గొప్పవి చేసి భావజాలరంగంలో విస్ర్తుతంగా ప్రచారం చేశారు. ఆ పనే స్ర్తీలు చేస్తే పతిత, భ్రష్ట, కులట,వ్యభిచారి,కామ పిశాచి,లం..,అని నీచమైన పదజాలం వాడారు.
భర్త త్రాగుబోతు,వ్యభిచారి, శాడిస్టు, పరమనీచుడు, దుర్మార్గుడైనప్పటికి భర్తే దైవ సమానుడని, తాళ్లి కట్టిన తరువాత తనువు చాలించేవరకు భర్త కాళ్ళ వద్ద పడి వుండి పాద పూజ చేసుకుంటూ బ్రతకడమే స్ర్తీ జన్మకు పరమార్థమని ,మోక్ష మని ఆమె వ్యక్తిత్వాన్ని పూర్తిగా ధ్వంసం చేసి పురుషుడికి స్ర్తీ ని ఎదురు తిరగని బానిసగా కట్టి పడేశారు.
భర్తను వదిలేసిన స్త్రీని బరితెగించిన ఆడదిగా, బజారుదానిగా, నీచురాలిగా చిత్రీకరించి మానసిక హింసకు గురి చేశారు. భర్త తోడులేని ఆడది వంటరిగా బ్రతకటం కష్టమన్నారు. ఒంటరిగా వున్న ఆడది ప్రతి వాడికి లోకువే ననే విధంగా భయపెట్టి కోలుకోలేని దెబ్బతీశారు. పుట్టెడు కష్టాలతో ,దుఃఖం తో వున్న స్త్రీని కడుపులో పెట్టుకొని కాపాడాల్సిన సమాజం చీత్కారాలకు, ఈసడింపులకు గురి చేసింది. నీచమైన ఈ సమాజం చూసే నీచపు చూపులకు, సూటి పోటీ మాటలకు భయపడి కన్నవారు, తోడబుట్టిన వారు కూడా కర్కశంగా మారుతున్నారు. రూపంలో స్త్రీ గానే వుంచి సారంలో పురుషాధిపత్యపు దోపిడీ భావజాలంతో స్త్రీల మెదళ్ళ లను నింపివేశారు. ఆడదానికి ఆడదే శత్రువు అన్న భావనను కలిగించారు.
కుష్టి రోగి అయిన భర్తను బుట్టలో కూర్చుండ పెట్టుకొని మరో ఆవిడ వద్దకు నెత్తిన మోసుకుపోయిన సతీ సుమతి స్త్రీలకు ఆదర్శమన్నారు. సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ సక్కుబాయి, తార , మండో దరి, అహల్య, సీత లాంటి వారిని ఉత్తమ ఇల్లాలైన స్త్రీలకు ప్రతీకలుగా చూపించి పతివ్రతలు అంటే అలా వుం డాలని చెప్పారు.
జూదంలో పందెంగా పణంగా పెట్టిన, అప్పులకు వేలంలో తెగ నమ్మిన, అనుమానంతో నిండు చూలాలను కారడవులకు పంపించిన, తనకు ఏ పాపం తెలియకపోయినా శిలగా శపించబడ్డా — నోరు మెదపకుండా భరించాలనే భావనను కల్పించడానికి ద్రౌపది , చంద్రమతి, అహల్య, సీతవంటి స్త్రీ పాత్రల ద్వారా ధర్మాన్నివల్లించారు.కట్టుదిట్టమైన ఆచారాలను బలమైన సాంప్రదాయాలను ప్రవేశపెట్టారు,పురాణాలు,ఇతిహాసాలు,శాస్ర్తాల కథల ద్వారా ప్రచారంచేశారు.
భర్త వ్యసనపరుడై బజారున పడితే అతగాడి పరువు ప్రతిష్టలను కాపాడే బాధ్యతను భార్యలపై వుంచిందీ సమాజం. భర్త తన చెడు ప్రవర్తన ద్వార పరువు, ప్రతిష్ఠలు పోగొట్టుకుంటే వాటిని కాపాడే బాధ్యతను భార్య లపైవుంచిదీ సమాజం.అలా చేయడం గుణవతి, ధర్మపత్ని, మహా ఇల్లాలి యొక్క ధర్మంగా ప్రచారం గావించారు. గత కాలపు సాహిత్యం నిండా స్త్రీని అన్ని విధాల అణిచివేతకు, హింసకు , బానిసత్వానికి గురిచేసే కుటిల నీతి వ్రాయబడింది.
పురుషాధిక్యతను చాటి చెప్పుకోవడానికి పతిభక్తి సూత్రాన్ని పాతివ్రత్యపు ధర్మాలను కనిపెట్టారు. మాతృ స్వామిక సామాజిక వ్యవస్థపై, దాని ఆచారాలపై ఈ పతిభక్తి సూత్రాలతో మొట్టమొదట చావుదెబ్బ తీశారు. పతి భక్తితో పాటు వైదవ్యం కూడా వచ్చి చేరి స్త్రీల జీవితం దుఃఖభరితం గావించబడింది. పాతివృత్యంతో పాటు వ్యభిచారం పుట్టింది. పాప పుణ్యాలు, ధర్మా ధర్మాలు,పితృ స్వామిక సమాజాన్ని అనుసరించే వచ్చాయి .
స్త్రీ నిలుచుంటే తప్పు,కూర్చుంటే తప్పు,నవ్వితే తప్పు, ఎవరితోనైనా మాట్లాడితే తప్పు ,అందంగా ఉంటే తప్పు,చివరికి ఆమె బ్రతకడమే తప్పు .మతం పేర ,దైవం పేర ధర్మాలు వల్లించి స్త్రీని ఇంత హీన స్థితికి దిగజార్చిన ఈ మనువాద భ్రాహ్మిణికల్ పితృస్వామిక వ్యవస్థ స్త్రీని గౌరవిస్తున్నట్లు ,పూజిస్తున్నట్లు నటిస్తుంది. కానీ ఇదంతా వట్టి బూటకం.
ఒక ప్రక్కన బ్రాహ్మనీయ ఫ్యూడల్ సమాజం స్త్రీని పాతివ్రత్యపు బంధనాలతో కట్టిపడేసి అదేసమయంలో సామ్రాజ్యవాదంతో పీఠ ముడి వేసుకొని వ్యాపారానికి ఆమె ప్రతి అవయవాన్ని వినియోగించుకోవడానికి సిద్ధపడుతుంది. సిమెంట్ బస్తాలనమ్మటానికి, బీడీలు ,బ్లేడ్లు, రేజర్లు,క డ్రాయర్లు వంటి సరుకులు కొన మని చెప్పడానికి వస్తువుల అమ్మకాలకు ,వేల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలకు ,రాజకీయ అధికారానికి ఒకటేమిటి ప్రతిదానికి ఆడవారిని అంగడి సరుకుగా, ఆట బొమ్మగా వాడుకుంటున్నారు. ఆధునిక సమాజంలో స్త్రీ కేవలం భోగ వస్తువుగా, విలాసపు సరుకుగా మార్చబడింది . ఈ దేశపు స్ర్తీల సౌందర్యం కమ్చి లతో కొలవబడ్డది.విపణిలో వెలకట్టబడ్డది.
ఉత్పత్తి సాధనాలు పురుషుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. పితృ స్వామిక వ్యవస్థలో ఆమె ఆర్థికంగా విలువను కోల్పోయింది. పురుషాధిపత్యపు సమాజం ఆమె ఘనతను తగ్గించడానికి చాలా దుర్మార్గమైన కుట్రలు చేసింది. క్రూరమైన విధానాలు అవలంబించబడ్డాయి. ఆమె కట్టు బానిసలా జీవించే స్థితికి దిగజార్చబడింది. పురుషుని వంశాన్ని వృద్ధిచేయడానికి పిల్లలను కనే యంత్రంగా ఆమెను మార్చేశారు.ఇంటికే పరిమితం చేశారు.ఇంటిపని ని విలువలేనిదిగా దిగజార్చారు. ఆమె శ్రమకుగాని, కష్టానికి గాని, విలువ లేకుండా పోయింది.చదువుకు,సంపాదనకు జ్ఞానానికి దూరం చేశారు.
త్యాగమూర్తి, శీలవతి, పుణ్యవతి, గుణవతి,అన్నపూర్ణ , పతివ్రతా శిరోమణి ,పరమ సాధ్వి, మాతృమూర్తి అని మనం నాజూకుగా వాడే పదాల వెనుక ఎంత దుఃఖం, ఎంత వేదన, ఎంత చాకిరి, ఎన్ని అవమానాలు, ఎంత హింస, ఎన్ని రకాల చిత్రవధ లు స్త్రీలు అనుభవించారో చెప్పనలవి కాదు ,రాయ వీలు కాదు .స్త్రీల ఔన్నత్యాన్ని ధ్వంసం చేసి ఆ సమాధిపై హిందూత్వ సంస్కృతి పేరిట నగిషీలు చెక్కారు.
ఆర్య బ్రాహ్మణికల్ పురుషాధిపత్య ఫ్యూడల్ సమాజంలో సృష్టించబడ్డ మగ దేవుళ్ళకు ఆదిమ మాతృ స్వామిక సమాజపు ప్రతీకలైను స్ర్తీ దేవతలను భార్యలుగా చేసి పురాణాల కట్టుకథల అల్లికలు వేశారు.తద్వారా ఈ దేశపు మూలవాసుల సంస్కృతీ సాంప్రదాయాలను ధ్వంసం చేసి తమవైన బ్రాహ్మిణికల్ సంస్కృతీ సాంప్రదాయాలను నెలకొల్పారు.
సంపదలకు అధిపతి ఆడదైన లక్ష్మీ అన్నారు . కానీ సంపదను ఆమె చేతిలో లేకుండా చేశారు. చదువుల తల్లి సరస్వతి అన్నారు. కానీ ఆడది చదవటానికి వీలు లేదు విజ్ఞానానికి అనర్హురాలని శాస్త్రాలు రాశారు. ఓర్చుకోలేనంత బాధలకు, హింసలకు గురి చేసి ఓర్పుకి భూదేవత అన్నారు.ఓర్చుకోలేక ఎదురు తిరిగితే బరితెగించిందని బూతులు తిట్టారు. పిల్లలు పుట్టడం అనేది ఒకానొక ప్రకృతి సహజ సిద్ధమైన కార్యక్రమం .దానికి మాతృత్వం అనే ముద్దు పేరు పెట్టి మాతృమూర్తిగా కీర్తించారు . తల్లి అవ్వడాన్ని సెంటిమెంటలైజ్ చేసిన పితృ స్వామిక భావజాలం పిల్లల పెంపకం, ఆలనా పాలనల బాధ్యతలను తల్లిపై మోపడం పకడ్బందీగా, కుట్రపూరితంగా జరిగిందనేది భావోద్వేగాలకు అతీతంగా అర్థం చేసుకోవాల్సిన విషయం.
భారతదేశం వేద భూమని ,వేదాలు, పురాణాలు మనకు ఆదర్శమని, మార్గ నిర్దేశికమని గొప్పగా చెప్పుకుంటాం. ఈ వేదాలు, ఈ పురాణాలు స్త్రీల గురించి ఏం చెప్పాయంటే… భర్త చితి పైకెక్కి భార్య సహగమనం చేయడాన్ని గొప్పగా వర్ణించాయి . స్త్రీలను అబద్దాలు పుట్టలని చెప్పాయి. అందమైన ఆడదాన్ని నమ్మవద్దని , మగవారిని వశం చేసుకొని స్త్రీలు తమ పనులు సాధించుకుంటారని నిందలు వేశాయి. సొంత వ్యక్తిత్వం స్వతంత్రంగా ఆలోచించడానికి వీలులేదని శాసించాయి. పవిత్ర గ్రంథాలని చెప్పబడుతున్న బైబిల్, ఖురాన్ కూడా స్త్రీలను నీచంగానే చూశాయి. స్త్రీ నరకానికి ద్వారమన్నాయి. స్త్రీ పాపాల పుట్టని, సాతాను రూపమనీ అన్నాయి. పురుషుడు స్త్రీని ఎప్పుడు అనుమానిస్తూ, దండిస్తూ వుం డాలని లేకుంటే అదుపాజ్ఞలలో వుండరని చెప్పాయి. ఏ మతం ఏ దేవుడు కూడా స్త్రీకి ఉన్నతమైన స్థానం ఇవ్వలేదు. నిందలకు, అవమానాలకు, అనుమానాలకే గురి చేసాయి.
ఇవన్నీ స్త్రీలు–, పురుషులు అనే రెండు జాతుల మధ్య (లింగాలు) వైరుధ్యాలుగా, తగాదాలుగా, గొడవలుగా మనకు పైకి కనిపిస్తాయి. కానీ వాస్తవంగా సారాంశంలో వీటన్నిటికీ పునాదిగా వున్నది ప్రస్తుతం అమలులో వున్న సామాజిక వ్యవస్థ. ఇది అర్థ భూస్వామ్య, అర్థవలస, కులవర్గ సమాజంగా వున్నది. ఈ వ్యవస్థలో అమలులో వున్న ఉత్పత్తి సంబంధాలలో మార్పు రాకుండా స్త్రీ పురుషుల మధ్య వైరుధ్యం గాని, స్త్రీలపై జరుగుతున్న హింస ,అణిచివేత, అత్యాచారాలకు గాని పరిష్కారం లేదు. కనుక అణచివేతకు,దోపిడీకి గురవుతున్న ప్రజా సమూహాలన్ని కలసి కట్టుగా కదలి ఉత్పత్తి సంబంధాలలో మార్పుని, తద్వారా సమాజ మార్పుని సాధించుకోవడమే మన ముందున్న శాస్త్రీయమైన మార్గం, అదే సరి అయిన పరిష్కారం.

అభినందనలతో విక్రమ్ బత్తుల
సంగారెడ్డి జిల్లా

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments