– ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి..
– పోలీసులను ఆశ్రయించిన బాధితులు సత్యమేవ జయతే – మహాబుబాబాద్ మహబూబాబాద్ : ‘మా నాన్న ధరావత్ చిట్టిబాబుకు మాయ మాటలు చెప్పి అవసరానికి కిడ్నీ తీసుకుని మోసం చేశారు. ప్రస్తుతం ఆయన చావుబతుకుల్లో ఉన్నాడు’ అని అతడి కుమార్తె భూక్యా రమాదేవి శనివారం కురవి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు శివారు పొలంపల్లి తండాకు చెందిన ధరావత్ చిట్టిబాబుకు ఇద్దరు కుమారులు నితిన్, రాము, కుమా ర్తె రమాదేవి ఉన్నారు. భార్య విజయ 3 ఏండ్ల క్రితం మృతిచెందింది. నల్లెల్ల శివారు గాజతండాకు చెందిన ధరావత్ చంద్ర అనే వ్యక్తి సంవత్సరంన్నర క్రితం కిడ్నీ వ్యాధితో బాధపడుతుండగా, గాజతండా కు చెందిన ధరావత్ సురేశ్, బానోత్ నవీన్‌తో కలిసి పొలంపల్లి తండాకు చెందిన ధరావత్ రవి వద్దకు వచ్చారు. నలుగురు కలిసి ధరావత్ చిట్టిబాబు ఇంటికి వెళ్లి కిడ్నీ ఇస్తే రెండు ఎకరాల భూమి, రెండు గుంటల స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని, భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్య లు వచ్చినా చూసుకుంటామని చెప్పి ఒప్పించారు. కుటుంబసభ్యుల సమక్షంలో అగ్రిమెంటు రాసి, చిట్టిబాబును హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి కిడ్నీ తీయించి, చంద్రకు అమర్చారు.
ప్ర స్తుతం చిట్టిబాబుకు ఉన్న ఒక్క కిడ్నీ చెడిపోయింది. ఆరోగ్యం బాగాలేదని, నాడు హామీ ఇచ్చిన వారి వద్దకు వెళ్లి అడిగితే తమకేం సంబంధం లేదని, దిక్కున్నచోట చెప్పుకోమన్నారు. తన తండ్రి అనారోగ్యంతో మహబూబాబాద్ ఏరియా వై ద్యశాలలో చికిత్స పొందుతున్నాడని, మోసం చేసిన చంద్ర, రవి, సురేశ్, నవీన్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రమాదేవి ఫిర్యాదులో పేర్కొన్నది.