• 21 రోజులు విధులకు రాకుంటే వేటే
• పది రోజుల్లో వివరణ ఇవ్వకున్నా పనిష్మెంట్
• క్రమశిక్షణ చర్యల్లో జరిమానాల విధింపు
• రహస్యంగా పోలీసుశాఖ ఉత్తర్వులు జారీ! సత్యమేవ జయతే – హైదరాబాద్ హైదరాబాద్ : ‘అన్నా.. ఎప్పుడూ లేనిది కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంగార్డులపై కఠిన ఆంక్షలు పెట్టారు. మా బాధలు ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియడం లేదు.’ అంటూ కన్నీటి పర్యంతమవుతూ ఆత్మీయులకు, మీడియా ప్రతినిధులకు హోంగార్డులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ప్రభుత్వం రహస్యంగా ఇచ్చిన మెమోలు, ఉత్తర్వుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని చెప్తున్నారు. అసలు ఆ ఉత్తర్వులు ఏంటా అని ఆరాతీస్తే నివ్వెరపోయే వాస్తవాలు తెలుస్తున్నాయి. హోంగార్డులపై మరింత కఠినమైన ఆంక్షలు విధిస్తూ ఫిబ్రవరి 25న తెలంగాణ పోలీసుశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు స్వచ్ఛంద సేవ అంటూనే రెగ్యులర్ ఉద్యోగుల కంటే దారుణంగా ఆంక్షలు విధిస్తున్నారని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోంగార్డుల కారుణ్య నియామకాలకు చరమగీతం పాడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా హోంగార్డులు వరసగా 21 రోజులు విధులకు గైర్హాజరైతే సస్పెండ్ చేసే అధికారం ఆయా జిల్లాల యూనిట్ ఆఫీసర్లకు ఇచ్చింది. వెంటనే వారిపై ఎస్బీ విచారణకు ఆదేశించేలా ఏర్పాట్లు చేసింది. దీంతో ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న చాలామంది హోంగార్డులు తమ ఉద్యోగాలు వదులుకోకతప్పని పరిస్థితి నెలకొంది. ఇటీవలి జీవోలో రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ అలవెన్స్‌ను రూ.200 ఇస్తున్నామని చెబితే ఫిబ్రవరి 25న ఇచ్చిన సర్క్యూలర్ మెమోలో రూ.100 అని పేర్కొంది. కమిటీ పేరుతో చేయని తప్పులకు తమను రోడ్డుపాలు చేస్తారేమోనని హోంగార్డులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పోలీసుశాఖ మెమోలోని ముఖ్యమైన అంశాలు 1) 21 రోజుల నిబంధన
హోంగార్డు 21 రోజుల పాటు అనధికారంగా గైర్హాజరైతే లేదా 3 నెలల వ్యవధిలో 21 రోజుల కంటే ఎకువగా ఆబ్సెంట్ అయితే, లేదా ముఖ్యమైన బందోబస్తు విధులకు క్రమం తప్పకుండా గైర్హాజరైతే అతను యూనిట్ అధికారి/డీసీపీ ప్రధాన కార్యాలయం/డీసీపీ (పరిపాలన) ద్వారా సస్పెండ్ అవుతారు. హోంగార్డు 10 రోజులలోపు వివరణను సమర్పించాలి. సంబంధిత అధికారి ఆ వివరణతో సంతృప్తి చెందితే, హోంగార్డును విధుల్లోకి తీసుకుంటారు. లేకపోతే క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేయడానికి విషయం ముఖ్య కార్యాలయానికి పంపిస్తారు.
2) హోంగార్డుల క్రిమినల్ కార్యకలాపాలు/దుష్ప్రవర్తన/ఎఫ్‌ఐఆర్ వంటి అంశాలు
హోంగార్డు యూనిట్ అధికారి/డీసీపీ ప్రధాన కార్యాలయం/డీసీపీ (పరిపాలన) ద్వారా సస్పెండ్ అవుతారు. ఆ తర్వాత విచారణకు ఆదేశిస్తారు. సంబంధిత అధికారి నుంచి షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. హోంగార్డు 10 రోజులలోపు వివరణను సమర్పించాలి. ఆ వివరణతో అధికారి సంతృప్తి చెందితే, ఆ అధికారి నేరం చాలా తీవ్రంగా లేదని భావిస్తే చర్యలు నామమాత్రంగా ఉంటాయి. ఒకవేళ హోంగార్డు వివరణ పంపకపోతే, పంపిన వివరణపై అధికారి సంతృప్తి చెందకపోతే వెంటనే క్రమశిక్షణ చర్యల కమిటీకి విషయం తెలియజేస్తారు. ఆ క్రమశిక్షణా కమిటీ కేసును సమీక్షిస్తుంది.
3) గైర్హాజరీని ఎలా పరిశీలించాలి?
ఐదు రోజులకు పైగా హోంగార్డులు గైర్హాజరు అయితే ఎప్పటికప్పుడు ఆ నివేదికను ఉన్నతాధికారులకు పంపాలి. ప్రతినెలా 24వ తేదీలోపు హోంగార్డుల హాజరు, గైర్హాజరీని హెచ్‌జీవో కార్యాలయానికి సమర్పించాలి. నెలలో రెండు రోజులు హోంగార్డులను కవాతుకు పంపాలి. ఆ బాధ్యత సంబంధిత అధికారులదే. ఈ కఠిన నిబంధనలతో హోంగార్డులు కన్నీటిపర్యంతమవుతున్నారు.