* ఆగమేఘాలపై సర్క్యులర్ జారీచేసిన ప్రభుత్వం
* సర్క్యులర్‌తో సరిపెట్టొద్దు.. జీవో ఇచ్చేదాకా పోరాటం
* త్వరలో లక్షలాది మందితో మహాసభ: గౌడ సంఘాలు
సత్యమేవ జయతే – హైదరాబాద్ హైదరాబాద్ : నీరాకేఫ్‌ను పూర్తిస్థాయిలో గీత పారిశ్రామిక కార్పొరేషన్‌కు అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నీరాకేఫ్‌కు సంబంధించి టూరిజం, ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎండీ ప్రకాశ్‌రెడ్డితో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. శనివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రిని గౌడ సంఘాల నేతలు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పల్లె లక్ష్మణ్‌రావు తదితరులు కలిశారు. నీరాకేఫ్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం, గౌడ సంఘం భవన నిర్మాణానికి సంబంధించిన అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ గౌడ సంఘం భవన నిర్మాణానికి ప్రముఖులందరినీ కలుపుకుని మార్చి తర్వాత భవన నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ట్యాంక్ బండ్ మీద సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి స్థలం పరిశీలన అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి తనకు అప్పగించారని తెలిపారు. సర్కారు సర్క్యులర్ జారీ
గౌడ సంఘాల నేతలు మంత్రి పొన్నంతో సమావేశమైన తర్వాత నీరాకేఫ్‌ను కల్లుగీత కార్పొరేషన్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఆగమేఘాల మీద సర్క్యూలర్ జారీ చేసింది. మరోవైపు గౌడన్నల ఉపాధి కోసమే నిర్మించిన నీరాకేఫ్‌ను ఇతర వర్గాల వారికి ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం యత్నించిన విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ పసిగట్టింది. ఫిబ్రవరి 23న ‘త్వరలో నీరాకేఫ్ ఎత్తివేత?’ అనే శీర్షిక కథనం ప్రచురించింది. దీం తో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో గౌడ సంఘాలు, వారి అనుచరులు నీరాకేఫ్‌ను సందర్శించి.. పథకం ప్రకారం నీరాకేఫ్‌ను ఆగంపట్టిస్తున్న తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో నీరాకేఫ్, నీరా ప్రాసెసింగ్ యూనిట్ల అన్యాక్రాంతంపై ‘నమస్తే తెలంగాణ’ నాటి నుంచి వరసగా కథనాలు రాస్తూనే ఉంది. అందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గౌడ సంఘాలు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తూ, సమావేశాలు పెడుతుండటంతో పాటు ఈ నెల 17న హైదరాబాద్‌లో మహాధర్నాను చేపట్టాయి. దీంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద కొన్ని షరతులతో కూడిన సర్క్యూలర్ ఇచ్చింది. వరుస కథనాలు రాసిన ‘నమస్తే తెలంగాణ’ను గౌడ సంఘాల నేతలు అభినందించారు.