సత్యమేవ జయతే – హైదరాబాద్
హైదరాబాద్ : : రేవంత్ రెడ్డి హామీలపై ప్రశ్నిస్తున్నందుకే హరీశ్‌రావుపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల్లో ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ నేతలు ప్రజలపై మత్తు మందు చల్లారు. ఏడో గ్యారంటీగా ప్రజా పాలన అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రతీకార పాలన అమలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుపై రేవంత్ రెడ్డి కక్ష గట్టి ఓ నేరస్తుడు చక్రధర్‌తో పంజాగుట్ట పోలీసు స్టేషన్లో తప్పుడు కేసు పెట్టించారు. అధికారులను పావులుగా వాడుకుని హరీశ్‌రావును ఎంతగా వేధించినా ప్రజల పక్షానే ఉంటారు. హరీశ్‌రావు ఏడు సార్లు సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కొవిడ్ సమయంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఎన్నో సేవలు అందించారు. రేవంత్ రెడ్డిలాగా హరీశ్‌రావు ఓటుకు నోటు కేసులో పాలుపంచుకోలేదు. ఏదైనా చేసి దేంట్లోనైనా హరీశ్‌రావును ఇరికించాలని రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డిని హామీలపై ప్రశ్నిస్తున్నందుకే హరీష్ రావుపై కక్ష గట్టారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు మానకొండూరు పీఎస్‌లో కేసు పెట్టారు. యాదాద్రిలో రేవంత్ రుణ మాఫీ ఒట్టు పెట్టి మాట నిలుపుకోనందుకు హరీష్ రావు ప్రశ్నిస్తే అక్కడ కూడా కేసు పెట్టారు. ఇలా చిన్న చిన్న అంశాల్లో హరీశ్‌రావుపై కేసులు పెడుతున్నారు. పొలీసు ఉన్నతాధికారులు రేవంత్ అడుగులకు మడుగులొత్తుతున్నారు. పంజాగుట్ట కేసులో హరీశ్‌రావు దగ్గర కేవలం మూడు నెలలు పనిచేసిన వంశీని డీసీపీ చేసిన టార్చర్ అంతా ఇంతా కాదు. హరీశ్ రావు పేరు చెప్పాలని లేదంటే చంపేస్తామని డీసీపీ విజయ్ కుమార్ బెదిరించారు. నేను కూడా ఐపీఎస్ అధికారిగా పని చేశాను. సీఎంలు ఒత్తిడి చేసినంత మాత్రాన ఐపీఎస్ అధికారి పక్షపాతంతో వ్యవహరిస్తారా..? ఒత్తిడికి తలొగ్గలేమని చెప్పి విజయ్ కుమార్ లాంటి వాళ్ళు ఉద్యోగాలను వదిలివేయడం మంచిది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
చక్రధర్‌పై రకరకాల కేసులు ఉన్నాయి. లైంగిక దాడి వంటి తీవ్ర నేరారోపణలు చక్రధర్‌పై ఉన్నాయి. 1900 మందిని ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసు చక్రధర్‌పై ఉంది. కిడ్నాప్ కేసు కూడా చక్రధర్‌పై ఉంది. చక్రధర్ రేవంత్ ప్రోద్భలంతోనే హరీశ్‌రావుపై పంజాగుట్టలో కేసు పెట్టారు. మొదట హైకోర్టులో రిట్ వేసి చక్రధర్ విత్ డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత పంజాగుట్టలో ఫిర్యాదు చేయగానే కొన్ని గంటల్లోనే హరీశ్‌రావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి హరీశ్‌రావు, ఆయన అనుచరగణంపై పోలీసులు కక్ష గట్టి వ్యవహరిస్తున్నారు అని ఆర్ఎస్పీ తెలిపారు.