
– గర్భం దాల్చిన 13 ఏళ్ల బాలిక
– ముగ్గురు కామాంధులపై పోక్సో
– విద్యార్థి సంఘాల ఆందోళనలు
– స్టాలిన్ సర్కారుకు మరింత సెగ సత్యమేవ జయతే – చెన్నై : విద్యార్థుల జీవితాలను ఉద్ధరించాల్సిన ఉపాధ్యాయులే కీచకుల్లా మారిపోయారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు గురువులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. దీంతో అభంశుభం తెలియని ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేని అసహాయతలో ఉన్న బాలిక తల్లి.. ఆమెను నెలరోజుల పాటు స్కూలుకు సెలవు పెట్టించి అబార్షన్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో దారుణ ఘటన వెలుగు చూసింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పోచంపల్లి గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. బాలిక తల్లి చెప్పింది విని ఆగ్రహించిన ఆ హెడ్మాస్టర్.. వెంటనే శిశు సంక్షేమ అధికారులకు ఆమెతో ఫిర్యాదు చేయించారు. పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, ఒక డిగ్రీ టీచర్ తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక చెప్పింది. దీంతో శిశు సంక్షేమ సంరక్షణ అధికారులు బర్గూర్ మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, బాలికపై దారుణానికి ఒడిగట్టిన ఉపాధ్యాయులు చిన్నసామి(57), ఆర్ముగం(45), ప్రకాశ్(37)ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారి తీసింది. సీఎం స్టాలిన్‌కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శన చేశాయి. బాలికను కృష్ణగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమిళనాట వరుసగా అత్యాచార ఘటనలు స్టాలిన్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత ఏడాది డిసెంబరు 23న ప్రఖ్యాత అన్నామలై విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినిపై ఇద్దరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.