సత్యమేవ జయతే – హైదరాబాద్ హైదరాబాద్ : నీటిపారుదల, వ్యవసాయ, పట్టణాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగాలను రేవంత్ సర్కార్ నాశనం చేసినట్టే విద్యారంగాన్ని నాశనం చేస్తోంది అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డికి విద్యారంగంపై కనీస అవగాహన లేదు అని తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పరిగి నియోజకవర్గం కుల్కచర్లలో విద్యార్ధి మరణం.. అలాగే బాలానగర్‌లో ఆరాధ్య అనే విద్యార్థిని ఆత్మహత్య చాలా బాధించాయి. విద్యార్థుల మరణాలు అందర్నీ కలిచివేస్తున్నా ప్రభుత్వ పెద్దల్లో మాత్రం చలనం లేదు. గురుకులాల్లో పరిస్థితులు సిగ్గుతో తలవంచుకునేలా మారాయి. గురుకులాల్లో ప్రవేశానికి కేసీఆర్ హయాంలో ఒక్క సీటుకు ముగ్గురు అభ్యర్థులు పోటీ పడేవారు. ఇప్పుడు రేవంత్ హయాంలో పరిస్థితి తలకిందులు అయ్యింది. గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్షకు 40 వేల సీట్లకు 80 వేల మంది కూడా అప్లై చేసుకోలేదు. మూడు సార్లు గడువు తేదీ పొడగించినా స్పందన లేదు అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
విద్యాశాఖ మంత్రి పదవిని రేవంత్ రెడ్డి తీసుకున్నది విద్యారంగాన్ని కూకటి వేళ్ళతో పెకలించడానికా..? రేవంత్ రెడ్డి ప్రతిభా పాఠశాలల్లో ప్రవేశానికి ఎంట్రన్స్ టెస్ట్‌ను రద్దు చేశారు. ఎంట్రన్స్ టెస్ట్ పెడితే రేవంత్ రెడ్డికి వచ్చిన నొప్పేమిటి..? విద్యారంగంపై రేవంత్‌కు కనీస అవగాహన లేదు. కేసీఆర్ హయాంలో 30కి పైగా ప్రతిభా పాఠశాలలు నెలకొల్పారు. ప్రతిభా పాఠశాలల నుంచి ఎంతో మంది డాక్టర్లు, ఇంజినీర్లు తయారయ్యారు. ఇప్పుడు ప్రతిభా పాఠశాలలను రద్దు చేసే కుట్ర జరుగుతోంది. కేసీఆర్ హయాంలో గురుకుల సిబ్బందికి ప్రతి నెల మొదటి వారంలో జీతాలు వచ్చాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. సైనిక దళాల్లో చేరేందుకు కేసీఆర్ హయాంలో భువనగిరిలో ప్రత్యేక పాఠశాల మొదలు పెడితే ఇపుడు దాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
కేసీఆర్ హయాంలో గురుకులాల నుంచి మంచి డాక్టర్లు తయారయితే.. ఇప్పుడు 57 మంది విద్యార్థులు శవాలుగా మారారు. గురుకులాల్లో విద్యార్థుల అనీమియాతో చనిపోతున్నారు. మెడికల్ కళాశాలల్లో ఎస్సీ విద్యార్థుల ఫీజులు కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఏమవుతున్నట్టు..? గురుకులంలో చదివిన రజక కులానికి చెందిన విద్యార్థిని నందిని బ్యాడ్మింటన్‌లో నేషనల్ గేమ్స్‌లో బంగారు పథకం సాధిస్తే ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకం ప్రకటించలేదు. బీసీ విద్యార్థిని అయినందుకే నందినిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదా..? తక్షణమే నందినికి కోటి రూపాయల నజరానా ప్రకటించాలి. ప్రభుత్వానికి సిరాజ్, జరీన్‌లే కనిపిస్తున్నారా..? అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తే వారితో పాటు టీ న్యూస్ రిపోర్టర్‌పై కేసు పెట్టారు. ఆ ఇద్దరు విద్యార్థినులను కూడా పోలీస్ స్టేషన్లో రెండు గంటలు విచారించారు. చదువుకోవాల్సిన విద్యార్థినులను పోలీస్ స్టేషన్లో పెడతారా..? రేవంత్ రెడ్డిది దుర్మార్గపు పాలన. రేవంత్ రెడ్డిని ఎంత తొందరగా ఇంటికి సాగనంపితే అంత మంచిది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.