రో’హిత్ సూపర్ హిట్.. వన్డే సిరీస్ కూడా మనదే..!
రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగడంతో ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం రోహిత్ శర్మ (119) విజృంభణతో భారత్.. 44.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నామమాత్రపు మూడో వన్డే ఈనెల 12న అహ్మదాబాద్‌లో జరగనుంది
హైలైట్:
ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో భారత్ గెలుపు
మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం
సెంచరీతో రోహిత్ శర్మ చిలరేగిపోయాడు.
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న భారత్.. వన్డే సిరీస్‌ను కూడా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకుంది. ఆదివారం కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా.. 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో తిరుగులోనే ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 305 పరుగుల లక్ష్యాన్ని 44.3 ఓవర్లలోనే ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (26), బెన్ డకెట్ (65) మెరుపు ఆరంభం ఇవ్వడంతో ఓ దశలో 10.4 ఓవర్లలో 81/0తో నిలిచింది. అయితే డెబ్యూ ప్లేయర్ వరుణ్ చక్రవర్తి ఫిల్ సాల్ట్‌ను ఔట్ చేసి భారత్‌కు తొలి వికెట్ అందించాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఇంగ్లాండ్ బ్యాటర్లు జో రూట్ (69), లియామ్ లివింగ్‌స్టోన్ (41) ఫర్వాలేదనిపించారు. దీంతో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 రన్స్‌కి ఆలౌటైంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3, మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలు ఒక్కో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 16.4 ఓవర్లలో 136 పరుగులు జోడించి.. విజయానికి గట్టి పునాది వేశారు. గత కొంతకాలంగా ఆశించిన మేర రాణించలేకపోతున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌లో పరుగుల దాహం తీర్చుకున్నాడు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ, 76 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. వన్డే క్రికెట్లో తన 32వ సెంచరీని నమోదు చేశాడు.
శుభ్‌మన్ గిల్ (60), శ్రేయస్ అయ్యర్ (44), అక్షర్ పటేల్ (41*) కూడా రాణించడంతో భారత్.. 44.3 ఓవర్లలోనే 305 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. నాలుగు వికెట్లు తేడాతో జయభేరి మోగించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలోకి నిలిచింది. నామమాత్రపు మూడో వన్డే బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.5