Friday, March 14, 2025
ads
Homeజిల్లాలుముందు ఓటు.. వెనక వేటు.. సంకటంలో జంప్‌ జిలానీలు!

ముందు ఓటు.. వెనక వేటు.. సంకటంలో జంప్‌ జిలానీలు!

– ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటువైపు ఉండాలి?
– గోడ దూకిన ఎమ్మెల్యేల్లో అంతర్మథనం
– కాంగ్రెస్‌కు ఓటేయడమంటే రాజకీయ భవితను బలిపెట్టడమేనని ఆందోళన సత్యమేవ జయతే – హైదరాబాద్
హైదరాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10మంది ఎమ్మెల్యేల అనర్హత అంశంపై మార్చి 4న సుప్రీంకోర్టు విచారణ జరుపనున్న విషయం తెలిసిందే. మార్చి 20వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్‌ జరుగనున్నది. ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇరకాటంలో పడింది. ఇప్పుడిదే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అనర్హత వేటు నుంచి తప్పించుకోవటానికి ఆ 10 మంది ఎమ్మెల్యేలు నానా తంటాలు పడుతున్నారు. అందులో భాగంగానే తాము ఇంకా బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉన్నామని చెప్పుకొంటూ వస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకులు తమ ఫొటోలను వారి పార్టీ ఫ్లెక్సీల్లో పెట్టుకుంటున్నారని, తమను అభాసుపాలు చేస్తున్నారని నమ్మబలుకుతున్నారు.
ఇదే విషయమై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే ఫిర్యాదు చేశారు. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తన అభిమాన నాయకులైన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్‌ ఫొటోలు తన ఇంట్లో పెట్టుకున్నామని చెప్పేశారు. కాంగ్రెస్‌లో చేరి పీఏసీ చైర్మన్‌ పదవిని దక్కించుకున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తాను పార్టీ మారనేలేదంటూ సందర్భం వచ్చిన ప్రతీసారి చెప్పుకొని తిరుగుతున్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి ఇప్పటికీ తన క్యాంప్‌ కార్యాలయంలో కేసీఆర్‌ ఫొటోను తొలగించకపోవడంతో స్థానిక కాంగ్రెస్‌ నాయకులు కార్యాలయంపై దాడిచేసి కేసీఆర్‌ చిత్రపటాన్ని తొలగించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎటువైపు ఉంటారు? అనేది చర్చనీయాంశంగా మారింది.

అగమ్యగోచరంగా గోడదూకిన ఎమ్మెల్యేల రాజకీయ భవిత
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటువైపు ఉండాలి అనే విషయంలో గోడ దూకిన ఎమ్మెల్యేలు తర్జనభర్జన పడుతున్నారు. అధికారికంగా పార్టీ మారి పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌, బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం నియమించకపోయినా, ఏ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రతిపాదించకపోయినా కాంగ్రెస్‌లో చేరటం వల్ల పీఏసీ చైర్మన్‌ పదవిని పొందిన అరికెపూడి గాంధీ సహా కాంగ్రెస్‌లోకి వెళ్లిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌కుమార్‌, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, గూడెం మహిపాల్‌ రెడ్డి.. ఈ 10 మంది ఎమ్మెల్యేల మెడపై ‘అనర్హత’ కత్తి వేలాడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ క్రమంలో తాము కాంగ్రెస్‌ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తే అనర్హత ముప్పు మరింత వేగంగా తలుపు తట్టే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విప్‌కు అనుగుణంగా ఎమ్మెల్యేలు నడుచుకోవాల్సి ఉంటుంది.

అయితే, ఎన్నికల సందర్భంగా విప్‌ జారీ చేసినా రహస్య ఓటింగ్‌ జరుగుతుంది కనుక తప్పించుకోవచ్చని భావిస్తే కుదరదని, ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఓటు ఎటు వేశారనేది తెలిసిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్‌కు మరో అస్త్రం దొరికినట్టే అవుతుంది. అలా కాకుండా ఓటింగ్‌కు దూరం ఉంటే కాంగ్రెస్‌తో పేచీ వెంటాడుతున్నది. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిన ఈ సంకటస్థితిలో తమ రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారిందని పార్టీ మారిన సీనియర్‌ ఎమ్మెల్యే ఒకరు తన సన్నిహితులతో వాపోయారని సమాచారం. కాంగ్రెస్‌లో చేరిన పాపానికి ఆ పార్టీ చెప్పినవారికి ఓటేయాలా? లేక రాజకీయ భవితవ్యాన్ని కాపాడుకోవాలా? అనే రెండు అంశాల మధ్య దేన్ని ఎంచుకోవాలో తేల్చుకోలేక సతమతమవుతున్నామని ఆయన ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలిసింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments