Friday, March 14, 2025
ads
Homeజిల్లాలుమాదిగ‌ల‌ను మోసం చేసిన రేవంత్ రెడ్డిని స‌మాధి చేస్తాం.....

మాదిగ‌ల‌ను మోసం చేసిన రేవంత్ రెడ్డిని స‌మాధి చేస్తాం.. ఎంఎస్ఎఫ్ హెచ్చ‌రిక

సత్యమేవ జయతే – హైదరాబాద్ హైదరాబాద్ : మాదిగ విద్యార్థులు, నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేస్తామని ఎంఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం కాకముందే వివిధ పోటీ పరీక్షల ఫలితాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి. పోలీసులు టెంట్ వేసేందుకు అనుమతించకపోవడంతో మండుటెండలో నల్లని గొడుగులతో విద్యార్థులు దీక్ష ప్రారంభించారు. అంతలోనే పోలీసులు రంగ ప్రవేశం చేసి దీక్షను భగ్నం చేశారు. దీక్షలో కూర్చున్న విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకొని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత మూడు దశాబ్దాల పోరాటంతో సాధించిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను, మాదిగ జాతి నోటికాడి ముద్దను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూరం చేస్తోందని మండిపడ్డారు. ఆయనను మాదిగ జాతి రాజకీయంగా భూస్థాపితం చేస్తుందని అన్నారు. అందరికంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని నిండు అసెంబ్లీలో మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి నేడు మాదిగ జాతికి ద్రోహం చేస్తూ మాలల కుట్రలు, ఒత్తిళ్లకు లొంగి వర్గీకరణ లేకుండా ఫలితాలను ప్రకటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రూప్1, గ్రూప్2, గ్రూప్ 3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, మిగతా అన్ని ఉద్యోగ ఫలితాలను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ చేయకుండా ఉద్యోగ భర్తీ చేయడం వలన మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోయారు. ఉద్యోగాల భర్తీ పూర్తయ్యాక వర్గీకరణ జరిగినా మాదిగ జాతికి అందే ఫలితం శూన్యమని అభిప్రాయపడ్డారు. తక్షణమే ఉద్యోగ భర్తీ ఫలితాలను నిలుపుదల చేసి వర్గీకరణ చట్టం చేయాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలలో ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, వర్గీకరణ చట్టం అయ్యేంతవరకు తమ నిరసనను ఆపేది లేదని స్పష్టం చేశారు. మాదిగలకు ద్రోహం చేస్తే గత పాలకులకు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ నాయకులు కొమ్ము శేఖర్, డాక్టర్ పల్లెర్ల సుధాకర్, రాజు, పరశురాము, జనపాల మహేష్, మంద అనిల్, కాసర్ల సైదులు, సిద్ధార్థ, నరేష్, సతీష్, విజయ్, రవీందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments