– జీహెచ్‌ఎంసీలో 23 అన్నపూర్ణ కేంద్రాల ఎత్తివేత
– 127 కేంద్రాల్లోనే రూ.5 భోజనం
– తగ్గిన నాణ్యత.. ఆపై అపరిశుభ్రత
సత్యమేవ జయతే – హైదరాబాద్
హైదరాబాద్ : అన్నపూర్ణ కేంద్రాలపై జీహెచ్‌ఎంసీ శీతకన్ను వేసింది. కేసీఆర్ హయాంలో దేశంలోనే అతిపెద్ద పథకంగా నిలిచిన పేదల అక్షయపాత్రను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో 150 అన్నపూర్ణ కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం అధికారులు 23 సెంటర్లను ఎత్తివేశారు. ఒక్కో సెంటర్ ద్వారా రోజుకు 300 మందికి చొప్పున 150 కేంద్రాల ద్వారా 45 వేల భోజనాలు అందించాల్సి ఉండగా, ప్రస్తుతం 127 సెంటర్ల ద్వారా దాదాపు రూ.30వేల మందికి మాత్రమే భోజనాలు అందిస్తున్నారు. సగటున రోజుకు ఒక కేంద్రం ద్వారా 250 భోజనాలు అందిస్తుండగా, ఏడాదికి రూ.25 కోట్ల మేర బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నారు.
కేసీఆర్ హయాంలో 216 కోట్లు వ్యయం
కేసీఆర్ సంకల్పంతో 2014లో ప్రారంభమైన 5 రూపాయలకే భోజనం పథకం విజయవంతంగా కొనసాగుతూ వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో 10 కోట్ల 88 లక్షల మందికిపైగా భోజనం అందించి దేశంలోనే అతిపెద్ద భోజన పథకంగా నిలిచింది. ఇందుకోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.216.01 కోట్లు వెచ్చించింది. వివిధ చిన్నచిన్న వృత్తులవారితోపాటు విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్నపూర్ణ పథకం వరప్రసాదంగా నిలిచింది. 15 అన్నపూర్ణ క్యాంటీన్లలో సిట్టింగ్ ఏర్పాటు చేసి ప్రైవేట్ భోజనశాలలకు ఏ మాత్రం తీసిపోకుండా అన్నపూర్ణ కేంద్రాలను తీర్చిదిద్దారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 పెద్ద ప్రభుత్వ దవాఖానలు ఉండగా, 17 దవాఖానల్లో రూ. 5లకే భోజనం అందిస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీహెచ్‌ఎంసీ అన్నపూర్ణ సెంటర్ల నిర్వహణను గాలికి వదిలేసింది. 23 సెంటర్లను ఎత్తివేయగా మిగిలి 127 సెంటర్లలో చాలావరకు అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తున్నదని స్థానికులు వాపోతున్నారు. సెంటర్ల పక్కనే చెత్త, చెదారం పోగుబడి దుర్వాసన వస్తున్నదని చెప్తున్నారు. భోజనం క్వాలిటీ కూడా పడిపోయిందని చెప్తున్నారు. ప్రతి కేంద్రం నుంచి 300 వరకు భోజనాలు అందించాల్సి ఉండగా కేవలం 230 మించడం లేదని మింట్ కాంపౌండ్ సెంటర్ల వద్ద పలువురు అభిప్రాయాలు వ్యక్తంచేశారు. అధికారులు మాత్రం అన్నపూర్ణ కేంద్రాలను పునరుద్ధరిస్తున్నామని చెప్తున్నారు.