Friday, March 14, 2025
ads
Homeక్రైమ్ న్యూస్ధరణి స్క్యం : మార్టిగేజ్‌ మతలబు!

ధరణి స్క్యం : మార్టిగేజ్‌ మతలబు!

– పంట రుణంగా వాణిజ్య రుణానికి స్లాట్‌.. మార్టిగేజ్‌ విలువ చెల్లించకుండా రిజిస్ట్రేషన్‌

– ధరణిలో అధికారులు, ఆపరేటర్ల చేతివాటం

– ప్రభుత్వ ఆదాయానికి రూ. కోట్లలో గండి

– ఆడిట్‌ లేకపోవడంతో అక్రమాలకు అవకాశం

సత్యమేవ జయతే – హైదరాబాద్‌

హైదరాబాద్‌ : ఒక రైతు తన అనుభవంలో ఉన్న 10 ఎకరాలకు వ్యవసాయ రుణం తీసుకోవాలంటే మార్టిగేజ్‌ చార్జీ చెల్లించాల్సిన పని లేదు. కేవలం డాక్యుమెంట్‌ చార్జీతో పంట రుణం పొందవచ్చు.
ధరణి పోర్టల్‌లో ఉన్న చిన్న లొసుగును అడ్డు పెట్టుకుని సర్కారు ఖజానాకు భారీగా గండి పెడుతున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయాన్ని అధికారులు, ఆపరేటర్లు తమ జేబుల్లో వేసుకుంటున్నారు. దీనిపై తహసీల్దార్ల పర్యవేక్షణ లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక రైతు తన అనుభవంలో ఉన్న 10 ఎకరాలకు వ్యవసాయ రుణం తీసుకోవాలంటే మార్టిగేజ్‌ చార్జీ చెల్లించాల్సిన పని లేదు. కేవలం డాక్యుమెంట్‌ చార్జీతో పంట రుణం పొందవచ్చు. అదే వ్యక్తి తన 10 ఎకరాలు తాకట్టు పెట్టి వాణిజ్య అవసరాలకు రుణం పొందాలంటే భూమి విలువలో మార్టిగేజ్‌ చార్జి 0.6 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడే ఆపరేటర్లు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఉదాహరణకు.. ఒక మార్టిగేజ్‌ డాక్యుమెంట్‌ విలువ రూ.44 లక్షలు ఉందనుకుందాం. దానిపై ఒక రైతు పంట రుణం తీసుకుంటే రూ.50 డాక్యుమెంట్‌ చార్జి చెల్లిస్తే సరిపోతుంది. అదే, వాణిజ్య రుణం తీసుకుంటే మాత్రం మార్టిగేజ్‌ విలువలో 0.6 శాతం; డాక్యుమెంట్‌ చార్జీ రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. రుణం ఎంత తీసుకున్నా.. డాక్యుమెంట్‌ విలువపై ఈ మార్టిగేజ్‌ విలువ 0.6 శాతాన్ని చెల్లించాల్సిందే.
అంటే, డాక్యుమెంట్‌ విలువ రూ.44 లక్షలు అనుకుంటే.. దానికి మార్టిగేజ్‌ విలువగా రూ.26,400 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వాణిజ్య రుణం తీసుకోవాలంటే ధరణి రిజిస్ట్రేషన్‌ సమయంలో ‘మార్టిగేజ్‌ వితవుట్‌ పొజిషన్‌’ అనే ఐచ్ఛికాన్ని ఎంపిక చేసి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. అప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన రూ.26,450 చెల్లించాల్సి ఉంటుంది. అదే పంట రుణం తీసుకోవాలంటే మాత్రం ‘మార్టిగేజ్‌ డీడ్‌ బై స్మాల్‌ ఫార్మర్‌ ఇన్‌ ఫేవర్‌ ఆఫ్‌ పీఏసీ లేదా గ్రామీణ బ్యాంక్స్‌, షెడ్యూల్డ్‌ బ్యాంక్స్‌’ అనే ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకోవాలి. అప్పుడు కేవలం డాక్యుమెంట్‌ చార్జీగా 50 రూపాయలకు మాత్రమే చలానా జెనరేట్‌ అవుతుంది. సరిగ్గా, ఇక్కడే ఆపరేటర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వాణిజ్య రుణం తీసుకున్నా దానిని పంట రుణంగా పేర్కొంటున్నారు. మార్టిగేజ్‌ విలువలో సగానికి సగం నొక్కేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సిన తహసీల్దార్లు కూడా తమ వాటాలు తీసుకుని వాణిజ్య రుణాలు తీసుకునే వారిని కూడా పంట రుణాల ఖాతాలో చూపి రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. దీనివల్ల సర్కారు ఆదాయానికి కోట్ల రూపాయల్లోనే గండి పడుతోంది. నిజానికి, ధరణి రిజిస్ట్రేషన్లపై ఏటా ఆడిట్‌ జరగాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకూ అస్సలు ఆడిట్టే జరగలేదు. ఈ అంశాన్ని పట్టించుకునేవారూ లేరు. దాంతో, ఈ గోల్‌మాల్‌ వ్యవహారం యధేచ్ఛగా సాగిపోతోంది. ధరణిలో రోజుకు 3500 స్లాట్‌లు బుక్‌ అవుతుండగా.. వాటిలో రిజిస్ట్రేషన్లు 2000 నుంచి 2500 వరకూ జరుగుతున్నాయి. అంటే, రోజుకు ఏ స్థాయిలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా దీనిపై ఆడిట్‌ చేస్తే ప్రభుత్వ ఖజానాకు ఎన్ని కోట్ల రూపాయలు నష్టం జరిగిందనేది తేలుతుంది.

పొరపాటు జరిగితే ఎవరిది బాధ్యత!?

ఒక చిన్న పొరపాటు లేదా ఉద్దేశపూర్వకంగా ఐచ్ఛికం తీసుకోవడంలో మార్పు చేస్తే చలానా కట్టాల్సిన సొమ్ములో భారీ తేడా కనిపిస్తోంది. మార్టిగేజ్‌ విలువకు సంబంధించి ప్రభుత్వం విధించిన రుసుం 0.6 శాతం చెల్లించకుండా కేవలం డాక్యుమెంట్‌ చార్జి మాత్రమే చెల్లించే వెసులబాటు ఉంది. మరి ఇలాంటి పొరపాటు జరిగితే దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలనే విషయమై రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రిజిస్ట్రేషన్‌ సమయంలో సరైన ఆప్షన్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేశారా లేదా అన్నది సంబంధిత రిజిస్ట్రార్‌ చూసుకోవాలి. అది వారి బాధ్యత. స్లాట్‌ బుక్‌ చేసే సమయంలో ఐచ్ఛికాల్లో ఆపరేటర్లే మార్పు చేసినా రిజిస్ట్రార్‌దే బాధ్యత అవుతుంది. ఆడిట్‌ సమయంలో ఈ విషయాలు వెలుగులోకి వస్తే ఆయన్నే బాధ్యున్ని చేస్తారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో డాక్యుమెంట్‌ను పరిశీలించి కంప్యూటర్‌ ఆపరేటర్‌కు తగిన జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత కూడా రిజిస్టార్‌ మీదనే ఉంటుంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments