– రేపు దేశవ్యాప్తంగా విడుదల కానున్న “తండేల్”
– వారసత్వపు వాసనలు లేకుండా సినిమారంగంలో అడుగుపెట్టడం, అసోసియేట్ డైరెక్టర్ స్థాయికి చేరుకోవడం ఆషామాషీ ముచ్చట ఏమి కాదు...!! సత్యమేవ జయతే – మహబూబాబాద్
మహబూబాబాద్ : కాలాన్ని, భవిష్యత్తును పణంగా పెట్టి, అవమానాలను దిగమింగుతూ..!, అవకాశాలను అనుక్షణం వెదుక్కుంటూ..!!, ఆకలిని, నిద్దురను, కుటుంబాన్ని మరిచిపోయి మరయంత్రంలా మారిపోయి, వందలాదిమందిని మెప్పించి.., తమ ప్రతిభతో ఒప్పిస్తే తప్పా… వెండితెర పైన పేరు కనబడదు...!!!
మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రానికి చెందిన ఓ..కుర్రోడు ఒంటరిగా సినిమారంగుల ప్రపంచంవైపు అడుగులు వేసాడు.., అడ్డుగా వచ్చిన అవరోధాలను దాటుకుంటూ తనకు తానే ఓ..బాటను వేసుకున్నాడు.
కఠోరశ్రమతో భారీ అంచనాల నడుమ అసోసియేట్ డైరెక్టర్ గా ఎదిగాడు. భారతదేశ వ్యాప్తంగా రేపు (ఈనెల 7వ తేదీన) విడుదల కానున్న నాగచైతన్య సాయిపల్లవి నటించిన తండేల్ చిత్రంతో తానేం చేసాడో చూపించబోతున్నాడు…
మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రానికి చెందిన కొదుమూరి వెంకటేశ్వర్లు-నాగమణి దంపతుల చిన్నకుమారుడు కొదుమూరి శ్రీనాథ్.., మొదటినుంచీ సినిమాలపై ఆసక్తితో చిన్నతనం నుండే షార్ట్ ఫిల్మ్ ల నిర్మాణంతో తన ప్రతిభను చాటుకున్నారు.
సినిమారంగంలో నిలదొక్కుకోవాలనే ఆశతో ఆలోచనతో అటువైపుగా అడుగులు వేసాడు. మొదట అమ్మ, నాన్న, కుటుంబసభ్యులు కొంత ఆందోళనకు గురైనా… శ్రీనాథ్ బలమైన ఆకాంక్ష, కష్టపడుతున్న తీరు క్రమంగా వారిలోను మార్పు తెచ్చింది. అడ్డు చెప్పడం మానుకొని, ఆసరాగా నిలవడం ప్రారంభించారు. తాను ఏం..చేస్తున్నాను, ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉంటున్నాను, అనే ఏ..అంశాన్ని ఇంటిదాకా, తన ఊరుదాకా…, రానిచ్చేవాడు కాదు శ్రీనాథ్…
ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అసోసియేట్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నాడు.* భారీ తారాగణంతో, భారీ అంచనాలతో నిర్మించబడిన తండేల్ సినిమా కు అసోసియేట్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. *తన ఇంటి పేరుతో పాటు తన ఊరి పేరు కూడా వెండితెరపై కనపడాలని తన ఊరి పేరు (కురవి)ను పేరు లో భాగం చేసుకున్నాడు శ్రీనాథ్..
ఈ చిత్రం ఘన విజయాన్ని సాదించాలని, మన.. కురవి కుర్రోడు కొదుమూరి శ్రీనాధ్ దర్శకుడిగా ఎదగాలని కోరుకుందాం…