సత్యమేవ జయతే – మహబూబ్‌నగర్
గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ జనరల్ గురుకులంలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది.
విద్యార్థులు ప్రార్థన కోసం సిద్ధమవుతున్న సందర్భంలో ఆరాధ్య (15) ఎవరూ లేని ఏడో తరగతి గదిలోకి వెళ్లి ఉరేసుకుంది. విద్యార్థినులు, ఉపాధ్యాయులు.. ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలిక నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని చొక్కన్నపల్లికి చెందిన కొమ్ము రమేశ్-రజిత దంపతుల కూతురు.. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పాఠశాల ఎదుట ధర్నా చేపట్టాయి. కలెక్టర్ విజయేంద్ర బోయి పాఠశాలను పరిశీలించి విద్యార్థిని మృతికి గల కారణాలను పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థిని కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని కల్పిస్తామని, విద్యార్థిని మృతికి కారణమైన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నేతల ద్వారా రూ.50 వేల ఆర్థిక సహాయం బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు.
విద్యార్థులు చనిపోతున్నా పట్టదా?: డీకే అరుణ
పాఠశాలల్లో విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ సర్కారును నిలదీశారు. నిన్న షాద్‌నగర్‌లో నీరజ్, తాజాగా బాలానగర్‌లో గురుకుల పాఠశాలలో ఆరాధ్య ప్రాణం తీసుకోవడం బాధాకరమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనలపై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.