సత్యమేవ జయతే – హైదరాబాద్ – బీపీ, షుగర్ అదుపులో లేకపోవడమే కారణం
– కిడ్నీ ఫెయిల్ కేసుల్లో 90శాతం మంది వీరే
* స్క్రీనింగ్ తప్పనిసరి: నిమ్స్ వైద్యులు డా. శ్రీభూషణ్‌రాజ్ హైదరాబాద్ : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ఈ మధ్య కాలంలో చాలామంది బీపీ, షుగర్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇక వీరిలో చాలామంది బీపీ షుగర్‌ను అదుపులో పెట్టుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుండటంతో కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. పదిహేనేండ్ల నాటి పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు దాదాపు ప్రతిరోజు పదుల సంఖ్యలో కిడ్నీ సంబంధిత రోగులు కొత్తగా నమోదవుతున్నారని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
వంశపారంపర్యంగా కొందరు కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతుండగా, దాదాపు 80 శాతం మంది బీపీ, షుగర్ బాధితులే కావడం గమనార్హం. కిడ్నీలు పూర్తిగా విఫలమైన వారిలో దాదాపు 90 శాతం మంది షుగర్, బీపీ నియంత్రణలో లేనివారే ఉంటున్నారని వైద్యనిపుణులు చెప్తున్నారు. బీపీ, షుగర్ ఉన్నవారు తగిన చికిత్స తీసుకోకపోవడంతో అది కిడ్నీలపై ప్రభావం చూపుతుందని, దీంతో అవి చెడిపోయి గుండెపోటుకు కూడా దారితీస్తుందని నిమ్స్ నెఫ్రాలజీ వైద్యనిపుణులు డాక్టర్ శ్రీభూషణ్‌రాజ్ తెలిపారు.
ఏటా రెండు లక్షల మందికి కిడ్నీ వ్యాధి
ప్రస్తుతం మన దేశంలో సుమారు 32.12 లక్షల మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు అంచనా. ప్రతి ఏడాది అదనంగా మరో రెండు లక్షల మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని నిపుణులు తెలుపుతున్నారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఏటా సుమారు 30వేల నుంచి 40వేల మంది కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతున్నట్టు పేర్కొన్నారు. వీరిలో 30 నుంచి 40 శాతం మందికి డయాలసిస్ అవసరమవుతున్నదని తెలిపారు. వారి సమస్యకు మధుమేహం 40 శాతం, హైబీపీ 30 శాతం కారణమని పేర్కొన్నారు. కొంతమందిలో తరచూ కిడ్నీలలో రాళ్లు రావడం వల్ల కూడా కిడ్నీలు పాడవుతున్నాయని తెలిపారు.
ఐదు దశలో కిడ్నీల వ్యాధి
కిడ్నీలు దెబ్బతినడానికి ఐదు దశలు ఉంటాయని డాక్టర్ భూషణరాజ్ తెలిపారు. ఇందులో మొదటి, రెండో దశలలో వ్యాధికి సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించవు. నెమ్మదిగా కిడ్నీల పనితీరు 100 నుంచి 10 శాతానికి పడిపోతుంది. అంటే చివరి 4, 5వ దశకు చేరుకోవటం. ఈ దశలో వ్యాధులు బయటపడడంతో రోగులు దవాఖానకు పరుగులు తీస్తారు. కానీ ఫలితం ఉండదు. అప్పుడు రెండే పరిష్కార మార్గాలు ఉంటాయి. ఒకటి కిడ్నీ మార్పిడి, రెండోది డయాలిసిస్. ఈ విధంగా కిడ్నీలు క్రమంగా పనిచేయకుండా క్షీణించిపోయే దశనే క్రానిక్ డామేజ్ అంటారు.
ఇవీ జాగ్రత్తలు:
బీపీ, షుగర్ నియంత్రణలో ఉండేలా జాగ్రత్త పడాలి
సిస్టోలిక్ బీపీ 130లోపు, డయాస్టొలిక్ బీపీ 85లోపు ఉండే విధంగా చూసుకోవాలి. ఈ మోతాదులు అదుపు తప్పితే వాటికి తగిన మందులు వైద్యుల సలహాల మేరకు వాడాలి.
సాధ్యమైనంత వరకు ఉప్పు మోతాదును తగ్గించాలి.
నిల్వచేసిన పచ్చళ్లు, ఊరగాయలకు దూరంగా ఉండాలి.
పొగ తాగేవారు వెంటనే అది మానేయాలి
ముఖ్యంగా కిడ్నీవ్యాధితో బాధపడే రోగులు పెయిన్ కిల్లర్ మందులు వాడే ముందు తప్పనిసరిగా నెఫ్రాలజిస్టు సలహా తీసుకోవాలి. లేకుంటే ఆ మందులు కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
స్క్రీనింగ్ తప్పనిసరి: డాక్టర్ శ్రీభూషణ్‌రాజ్
కిడ్నీ వ్యాధి లక్షణాలు ఉన్నవారు, హైబీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగ్గా స్క్రీనింగ్ చేయించుకోవాలి. షుగర్, బీపీ మాత్రమే ఉన్నవారు తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి కిడ్నీ ఫంక్షనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఇక కిడ్నీ సంబంధిత వ్యాధులున్నవారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. ఈ స్క్రీనింగ్ పరీక్షలను మూడు దశలుగా చేస్తారు.
అందులో మొదటిది కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. ఈ పరీక్షలో ప్రొటీన్స్గాని, రక్తం గాని నష్టపోతున్నట్టు తేలితే వారిని కిడ్నీ వ్యాధిగ్రస్థులుగా నిర్థారిస్తారు. రెండోది ఈజీఎఫ్ఆర్ పరీక్ష. అంటే నిమిషానికి 80 నుంచి 100 మిల్లీలీటర్ల నీటిని మూత్రపిండాలు ఫిల్టర్ చేయాలి. అంతకన్న తక్కువ శాతం ఫిల్టర్ చేస్తే వారు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించి తదుపరి పరీక్షలు నిర్వహిస్తారు. ఇక మూడోది క్రియాటిన్ పరీక్ష.