సత్యమేవ జయతే – హైదరాబాద్
– ఇటీవల ఐసీడీఎస్ ఉద్యోగుల వ్యవహారంతో సీరియస్
హైదరాబాద్ సిటీ: కలెక్టరేట్లో పనిస్తున్న ఉద్యోగులపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక నిఘా పెట్టారు. వేళలు పాటించకుండా కార్యాలయాలకు రావడం, పనివేళలు ముగియకముందే ఇంటిబాట పడుతున్న వారిపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఎవరు ఎప్పుడొస్తున్నారు.. ఎంతసేపు సీట్లలో కూర్చుని పైళ్లను పరిష్కరిస్తున్నారు.. అనే వివరాలను సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కలెక్టరేట్లోని జిల్లా స్ర్తీ, శిశు సంక్షేమశాఖ, ఆ పక్కనే ఉన్న బాలరక్షక్ష్ భవన్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు రిజిస్టర్లో సంతకం చేసి ఉన్నతాధికారుల అనుమతి లేకుండా మధ్యాహ్నంలోపే ఇటీవల ఆఫీస్ నుంచి బయటకు వెళ్లారు. ఈ విషయంపై పత్రికల్లో కథనాలు రావడంతో స్పందించిన కలెక్టర్ స్ర్తీ, శిశు సంక్షేమశాఖలోని 14 మందిపై చర్యలు తీసుకున్నారు. వారికి సంబంధించిన ఒకరోజు వేతనం నిలుపుదలతోపాటు సర్వీస్ కౌంట్‌ను చేయవద్దని ఎఫ్ఆర్-18 ప్రకారం ఉత్తర్వులు జారీచేశారు.
రోజూ ప్రత్యేక తనిఖీలు..
ప్రతి ఉద్యోగి వేళలు పాటించాలని, సమయం ముగియకముందే ఆఫీస్‌ను విడిచి వెళ్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు పెడచెవిన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు తనిఖీలకు కలెక్టర్ సిద్ధమవుతున్నారు. అలాగే, త్వరలో అన్నిశాఖల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయాలని భావిస్తున్నారు.