ఆ మందులు వాడొద్దు సత్యమేవ జయతే – హెల్త్ టిప్స్ వ్యాధులకు చికిత్సలో భాగంగా ఎన్నో మందులు వాడాల్సి వస్తుంది. వ్యాధి తగ్గుముఖం పట్టగానే ట్యాబ్లెట్లు వాడటం ఆపేస్తారు. కొన్నిసార్లు అవసరానికి మించి కొంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో మందులు మిగిలిపోతూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఎక్స్‌పైరీ డేట్ చూసుకునే మందులు వాడతారు. కాకపోతే ఎప్పుడో ఓసారి చూసుకోకుండానో, ఏమీ కాదనుకునో గడువు తీరిపోయిన మందులు వేసుకుంటారు. ఇలా చేయడం చాలా సందర్భాల్లో ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఇబుప్రొఫేన్, ఎసిటామినోఫెన్ లాంటి పెయిన్‌కిల్లర్లు, అలర్జీల నివారణకు వాడే యాంటిహిస్టమైన్స్ తేదీ అయిపోయాక వేసుకున్నప్పటికీ అంత ప్రమాదకరం కాకపోవచ్చు. డేట్ అయిపోయిన తర్వాత వాటి ప్రభావం అంతగా ఉండదు. దీంతో మరిన్ని వేసుకుంటారు. ఇలాంటి మాత్రలు ఒకసారి వేసుకుంటే అంత ఇబ్బంది కలగకపోవచ్చు కానీ, పరిమితి దాటితే మాత్రం ఆరోగ్యం మీద దుష్ప్రభావం తప్పకుండా పడుతుందని
అంటున్నారు వైద్యులు. ఇక గడువు తీరిపోయిన యాంటిబయాటిక్స్, గుండె మందులు, ఇన్సులిన్, ఎపిపెన్స్ లాంటి వాటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి డేట్ అయిపోయిన తర్వాత ఆ మందులను అసలు వాడనేకూడదు. కాబట్టి, మందులు వేసుకునేటప్పుడు తప్పనిసరిగా వాటి లేబుళ్లను చదవాలి.
యాంటిబయాటిక్స్
నిపుణుల అభిప్రాయంలో టెట్రాసైక్లిన్ లాంటి యాంటిబయాటిక్స్‌ను డేట్ అయిపోయాక వేసుకుంటే, అవి కిడ్నీలను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. పైగా అప్పటికే ఇవి తమ సామర్థ్యం కోల్పోయి ఉంటాయి. కాబట్టి, శరీరంలో చెడు బ్యాక్టీరియాను నిర్మూలించలేవు. దీంతో వ్యాధి మరింత ముదురుతుంది. ముఖ్యంగా లిక్విడ్ (ద్రవరూప) యాంటిబయాటిక్స్ విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన. అందువల్ల యాంటిబయాటిక్స్ విషయంలో వైద్యులు చెప్పిన కోర్సు వరకే వాడాలి. అదనంగా నిల్వ ఉంచుకోకూడదు. ఇక కోర్సు పూర్తి కాకముందే యాంటిబయాటిక్స్ ఆపేశారంటే అవి ముందుముందు మీ శరీరంపై పనిచేయవు.
గుండె మందులు: గుండె సమస్యలు ఉన్నవాళ్లు డేట్ అయిపోయిన మందులు అసలే ఉంచుకోకూడదు. వాటి సామర్థ్యం కోల్పోతాయి కాబట్టి, అవి వాటికి నిర్దేశించిన పనిచేయవు.
ఇన్సులిన్: డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడానికి ఇన్సులిన్ అవసరమవుతుంది. అయితే, డేట్ అయిపోయిన ఇన్సులిన్ వాడకూడదు. ఒకవేళ వాడితే డయాబెటిస్ (హైపర్‌ైగ్లెసిమియా) సమస్య మరింత తీవ్రమవుతుంది.
ఎపిపెన్స్: ఇవి జీవితాన్ని నిలబెట్టే మందులు. అయితే, డేట్ అయిపోయాక వాడితే మాత్రం జీవితానికి ముప్పు తెచ్చిపెడతాయి.
మందుగోలీలు కూడా రోజువారీ ఆహారం లాంటివే. ఎక్కువసేపు ఉంటే ఆహారం పాచిపోయినట్టే, మాత్రలు కూడా పనిచేయకుండా పోతాయి. అందుకే, ఎక్స్‌పైర్డ్ ట్యాబ్లెట్లు, ఇతర మందులు వాడొద్దు.
ఇతర సైడ్ ఎఫెక్ట్స్
టాక్సిసిటీ: డేట్ అయిపోయిన యాంటిబయాటిక్స్, ఐ డ్రాప్స్, క్రీములు బ్యాక్టీరియాతో (టాక్సిన్స్) కలుషితమైపోతాయి. దీంతో ఇవి అసలు సమస్యను తగ్గించడానికి బదులు కొత్త సమస్యలకు దారితీస్తాయి.
ఇన్ఫెక్షన్: ఎక్స్‌పైర్ అయిపోయిన మందుల్లో రసాయన మార్పులు జరుగుతుంటాయి. ఇవి చర్మం మంటపెట్టడం (ఇరిటేషన్) లాంటి అలర్జీ లక్షణాలకు దారితీస్తాయి. ముఖ్యంగా క్రీములు, ఆయింట్‌మెంట్లు, ఐ డ్రాప్స్ విషయంలో దీన్ని గమనించవచ్చు.
మరో మాట: మీ మందులను చల్లగా ఉన్న పొడి ప్రదేశంలోనే నిల్వ ఉంచాలి. ఒకవేళ తడి ప్రదేశంలో ఉంచితే వాటిలో ఉండే రసాయనాలు తొందరగా విచ్ఛిన్నమైపోతాయి. (నోట్ : ఇంటర్నెట్‌లో మరియు పుస్తకాల ఆధారంగా సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ‘సత్యమేవ జయతే’ బాధ్యత వహించదు.)