సత్యమేవ జయతే హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న ఆరోపించారు. ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీసులో జేఏసీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమస్యల పరిష్కారానికి తాము ఇచ్చిన సమ్మె నోటీసుపై ఆర్టీసీ యాజమాన్యం తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. సమ్మె నోటీసు ఇచ్చినప్పటి నుంచి తాము లేవనెత్తిన డిమాండ్లను పక్కనపెట్టి కార్మికులకు సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తూ ప్రతిరోజు డిపోల్లో సమావేశాలు ఏర్పాటు చేసి కార్మికుల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే ప్రధాన డిమాండ్లుగా జేఏసీ ప్రస్తావిస్తూ పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో జేఏసీ ఉపాధ్యక్షుడు థామస్ రెడ్డి, కోశాధికారి యాదయ్య తదితరులు పాల్గొని పలు అంశాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకున్నారు.